ఢీల్లీ బ్రోకర్ గాళ్లకు సంకెళ్ల సమ్మెట

క్రైం జాతీయం తెలంగాణ హైదరాబాద్

ఢీల్లీ బ్రోకర్ గాళ్లకు సంకెళ్ల సమ్మెట
– అమ్ముడుపోనిది తెలంగాణ ఆత్మగౌరవం
– తెలంగాణ హీరోలు నలుగురు ఎమ్మెల్యేలు
– ఎమ్మెల్యేల కొనుగోలుపై స్పందించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనుగోనేందుకు వచ్చిన ఢీల్లీ బ్రోకర్ గాళ్లకు సంకెళ్ల సమ్మెట పోటు పడిందని రాష్ట్ర ముఖ్యంత్రి కేసీఆర్ అన్నారు. మనుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. ఈ వేదికపై రాష్ట్రంలో సంచలనం రేపిన ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ స్పందించారు. నిన్నామొన్న కొంత మంది ఢిల్లీ బ్రోకర్‌గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్నే కొందామని చూశారని అన్నారు. వంద కోట్ల రూపాయలు ఇస్తామన్నా.. పార్టీ విడిచిపెట్టి రమ్మని చెప్పినా వాళ్లకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాల రాజు, ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి, ఎమ్మెల్యే రేగా కాంతారావులు ఎడమకాలి చెప్పుతో కొట్టి అమ్ముడుపోవుడు కాదురా.. మేం అంగట్లో సరుకు కాదు.. తెలంగాణ బిడ్డలమని.. తెలంగాణ ఆత్మగౌర బావుటాను హిమాలయపర్వతం అంత ఎత్తుకు ఎత్తారని కొనియాడారు. అలాంటివారు ఇప్పటి రాజకీయాలకు అవసరమని, జాతి గౌరవాన్ని, దేశగౌరవాన్ని అంగట్లో పశువుల్లా అమ్ముడుపోకుండా.. వందకోట్లు ఇస్తామన్నా గడ్డిపోచతో సమానంగా విసిరికొట్టి తెలంగాణను కాపాడిన బిడ్డలని అన్నారు. వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్‌ సభ్యులను, ఇతరులను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కొలగొట్టే అరాచకులకు జైళ్లో సంకెళ్ల పోటు దిగిందని అన్నారు.