దురాశతో దురాఘతం..!
– రూ. 1లక్ష కోసం బాలుడి కిడ్నాప్
– అరించినందుకు కత్తి దాడితో మృతి
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: సులభంగా డబ్బులు సంపాదించాలనే ఓ జులాయి దురాశతో దురాఘతానికి పాల్పడ్డాడు. రూ. 1 లక్ష కోసం బాలున్ని కిడ్నాప్ చేయగా.. ప్లాన్ అమలు చేసే క్రమంలో బాలుడు అరవడంతో కత్తితో దాడి చేశాడు. దెబ్బతో చనిపోయిన బాలుని మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేసాడు. కోడంగల్‌లో కలకలం రేపిన సూట్‌కేస్‌లో మృతదేహం లభ్యమైన బాలుడి హత్య కేసును పోలీసులు చేధించారు. సోమవారం వికారాబాద్‌జిల్లా జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి కోడంగల్ పోలీసులతో కలిసి మీడియాకు వివరాలను వెల్లడించారు. కోడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ నగర్ కాలనీలో అక్టోబర్ 29 శనివారం రజాక్ ఖాన్(11) అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరిగి డీఎస్పీ కరుణసాగర్ ఆధ్వర్యంలో సీఐ శంకర్, కోడంగల్ ఎస్ఐ రవి అదేరోజు నుంచి విచారణ చేపట్టారు. స్థానికుల సమాచారం మేరకు మిట్టి బౌలీ రజాక్ ఖాన్ యొక్క సైకిల్ గుర్తించారు. దీని ఆధారంగా అజయ్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు.
మద్యతరగతి కుటుంభీకుల పిల్లల లక్ష్యం
అజయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంలో పలు అసక్తికర విషయాలు తెలిసాయి. అజయ్ గతంలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ ఆ ఇంటి యజమాని దగ్గర ఉన్న డబ్బులు దొంగతనం చేసి అట్టి కేసులో అరెస్టు అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తరువాత అజయ్ ఎలాంటి పని పాటలేకుండా జులాయిగా తిరుగుతూ సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు చుట్టూ పక్కల నివసించేమధ్యతరగతి కుటుంభికులను లక్ష్యంగా చేసుకుని వారి యొక్క పిల్లలను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని దురాలోచనకు వచ్చాడు.
రూ. 1లక్ష కోసం రజాక్ ఖాన్ కిడ్నాప్
తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు వారం రోజుల ముందే పథకం వేసుకున్నాడు. ఇందులో భాగంగా అజయ్ వారం రోజుల ముందు నుంచే రజాక్ ఖాన్‌కు చాక్లెట్లు ఇచ్చి మచ్చిక చేసుకున్నాడు. పూర్తిగా నమ్మకం కలిగేంత వరకు వేచి చూశాడు. శనివారం రజాక్‌ను కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం మీనాన్నకు ఫోన్ చేసి రూ. 1లక్ష డిమాండ్ చేస్తానని చెప్పడంతో రజాక్‌ఖాన్ గట్టిగా అరవడం ప్రారంబించాడు. దీంతో అజయ్ ఒక పదునైన ఇనుప కత్తితో గట్టిగా తలపై కొట్టడంతో రజాక్ ఖాన్ చనిపోయాడు. శవాన్ని ఎలాగైనా బయటికి పడేయాలని అజయ్ తన మిత్రులకు ఫోన్ చేసి ఇంటికి పిలిచాడు. వారు ఇంట్లో సంఘటను చూసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. చివరకు పోలీసులకు పట్టుబడిన అజయ్ చేసిన నేరాన్ని పోలీసుల ముందు అంగీకరించాడు. ఈ మేరకు నిందితున్ని రిమాండుకు తరలించడం జరుగుతుందని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.
బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ
సమావేశం అనంతరం జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి బాలుడి నివాసానికి వెళ్లారు. రజాక్ ఖాన్ కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఎస్పీ వెంట పరిగి డీఎస్పీ కరుణాసాగర్, తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్, కోడంగల్ సీఐ శంకర్, ఎస్ఐ రవి, సిబ్బంది ఉన్నారు.

