బీజేపీకి హైకోర్టు షాక్
– ఎమ్మెల్యే ఎర కేసులో పోలీసుల దర్యాప్తుకు ఒకే
– ఆదేశాలు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రాజకీయాలలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల ఎర వ్యవహారం కేసులో హైకోర్టు బీజేపీ నేతలకు షాక్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులే దర్యాప్తు చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైకోర్టు ఆదేశాలు ఈకేసుకు కీలకంగా మారాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తును నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు రద్దు చేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా నేత ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ జరిపించాలని ప్రేమేందర్‌రెడ్డి పిటిషన్‌లో కోరారు. ఈ క్రమంలో విచారణ జరిపిన సందర్భంగా కేసు దర్యాప్తు నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ హైకోర్టు తెలిపింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని తెలిపింది. సీబీఐ, లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈకేసు విచారణ జరిపించాలని భాజపా దాఖలు చేసిన పిటిషన్‌పై లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. విచారణ పురోగతిపై కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. హైకోర్టు తాజా తీర్పుతో ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తు వేగవంతం చేసేందుకు మొయినాబాద్ పోలీసులకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశముంది. హైకోర్టు నిర్ణయంతో బీజేపీ నేతలకు గట్టి షాక్ తగిలింది.

