ఓడిపోయిన సర్పంచుకు రూ. 2 కోట్లు

జాతీయం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

ఓడిపోయిన సర్పంచుకు రూ. 2 కోట్లు
– బహుమతిగా ఓ స్కార్పియో కారు కూడ
– వైరల్‌ అయిన సంఘటన ఎక్కడంటే..?
దర్శిని డెస్క్‌: గ్రామస్థాయి నుంచి దేశం, ప్రపంచంలో ఎన్నికలు ఏవైనా పోటీ దారులకు గెలుపు ఓటములు వరించడం సాధారణం. గెలిచిన వారు ఉత్సహాం పొందితే.. ఓడిన వారు నిరుత్సహా పడతారు. ఇది ఎక్కడైనా జరిగేదే. గెలుపొందిన వారు ర్యాలీలు.. సంబరాలు చేసుకుంటారు. కాని ఓడిపోయిన అభ్యర్థి సంతోషంగా ఉండడం చాలా అరుదుగా ఉంటారు. వారిపై ప్రజల్లో సానుభూతి పెరిగిపోతుంది. అయితే హరియాణాలో ఓ ఓడిపోయిన సర్పంచ్‌కు సానుభూతి విపరీతంగా పెరిగిపోయింది. ఎతంలా అంటే ఓడిపోయిన అభ్యర్థికి రూ.2.11 కోట్ల నగదు, ఓ స్కార్పియో ఎస్‌యూవీ వాహనాన్ని బహూకరించి ఓదార్చారు. పూర్తి వివరాలకు వెళితే.. హరియాణాలోని ధర్మపాల్‌ అనే వ్యక్తి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రత్యర్థి అభ్యర్థిపై కేవలం 66 ఓట్ల తేడాతో ఆయన పరాజయం పాలయ్యారు. గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ, ఓటమి తప్పలేదు. దీంతో ఓడిపోయిన ధర్మపాల్‌కు ప్రజల్లో సానుభూతి మరింత ఎక్కువైంది. ఇంట్లో సొంత మనిషిలా తిరిగే ఆయనకు ఏదైనా చేయాలని గ్రామస్థులు, పెద్దలు నిర్ణయించుకున్నారు. అందరు కలిసి విరాళాలు సేకరించి స్కార్పియో ఎస్‌యూవీ వాహనాన్ని కొనుగోలు చేశారు. ఒక భారీ సమావేశం నిర్వహించి ధర్మపాల్‌కు రూ.2.11కోట్ల నగదుతోపాటు ఆ వాహనాన్ని బహూకరించారు. ఆయనకు తలపాగా అలంకరించి, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజలు తనపై చూపిన అభిమానానికి ధర్మపాల్‌ ఆశ్చర్యపోయారు. తనపై ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఎన్నికలు నిర్దేశించలేవని, గెలుపోటములు రాజకీయాల్లో సహజమని ఆయన అన్నారు. జీవితాంతం తన ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థిపై కూడా తనకు అసూయ, ద్వేషం ఏమీ లేవని ప్రజల అభ్యున్నతి కోసం పని చేసే ఎవరికైనా తనవంతు సహకారం చేస్తానని ధర్మపాల్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైన ధర్మపాల్‌ తండ్రి, తాతలు కూడా ఇంతకుముందు సర్పంచ్‌గా పని చేశారు. ధర్మపాల్ కూడ గతంలో లఖన్‌ మజ్రా బ్లాక్‌ సమితికి ఛైర్మన్‌గా వ్యవహరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.