డ్రోన్ సాగు ట్రయల్స్ సక్సెస్

టెక్నాలజీ తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

డ్రోన్ సాగు ట్రయల్స్ సక్సెస్
– కంది పంటపై మందుల పిచికారి
– సాకేంతిక వ్యవసాయానికి భవిత
– వ్యవసాయ శాస్త్రరవేత్త డా.సుధారాణి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు వ్యవపరిశోధన స్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రోన్ ద్వారా మందుల పిచికారి ట్రయల్స్‌ సక్సెస్ అయ్యాయి. శనివారం రైతుల సమక్షంలో డ్రోన్‌ ద్వారా కంది పంటకు మందుల పిచికారిపై ట్రయల్స్ నిర్వహించారు. మారుత్‌ డ్రోన్స్‌ అనే ప్రైవేటు సంస్థతో కలిసి డ్రోన్‌తో మందుల పిచికారిపై ట్రయల్స్‌ చేయగా అవి రైతులను ఆకట్టుకున్నాయి. పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.సుధారాణి ఆధ్వర్యంలో ఈ ట్రయల్స్ చేపట్టారు. కంది పంటలో డ్రోన్ పిచికారీపై ద్వారా రైతులు ఏ మోతాదులో నీటిని వాడాలి, రసాయనాలను వాడాలి, పంటపై ఎంత ఎత్తులో డ్రోన్‌తో పిచికారీ చేసుకోవాలని మొదలైన అంశాల గురించి వివరించి ట్రయల్స్ ప్రారంభించారు.

డ్రోన్‌ ఎలా పని చేస్తుందంటే..
జీపీఎస్‌, ఆటో పైలెట్‌ సహాయంతో రిమోట్‌ ద్వారా లేదా ఎల్‌సీడీ మొబైల్‌లో అగ్రిమీట్‌ / అగ్రి అసిస్టెంట్‌ యాప్‌ ద్వారా ముందుగా పొలంపైన సెట్‌ చేసిన ఎత్తులో నిర్దిష్టమైన వేగంతో, నిర్దిష్టమైన దిశలో పిచికారి చేసేందుకు డ్రోన్‌కు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తారు. ప్రస్తుత మార్కెట్‌లో స్థాయిని బట్టి ఒక డ్రోన్‌ ధర రూ.7 నుంచి రూ.12 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. 12-16వేల ఎంఎహెచ్‌ లిథియం పాలిమార్‌ బ్యాటరీతో 10లీటర్ల డ్రమ్ము, ఒక జత బ్యాటరీతో డ్రోన్‌ బరువు 13 కేజీల వరకు ఉంటుంది. ఒకసారి ఒక జత బ్యాటరీతో ఒక ఎకరానికి కేవలం 10 నిమిషాల్లో పిచికారి పూర్తి చేయవచ్చు. సిగ్నల్‌ పోయిన, మందు ఆయిపోయాన, బ్యాటరీ తగ్గిపోయిన, పిచికారి పూర్తయినా డ్రోన్‌ మొదట ఉన్న చోటకే తిరిగి వస్తుంది. డ్రోన్‌ ద్వారా పిచికారి పూర్తి చేసినది, ఇంకా చేయాల్సింది, చేస్తున్న ప్రదేశాన్ని మొబైల్‌ యాప్‌లో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో చూడవచ్చు. దీన్ని సులభంగా వినియోగించడానికి వీలుగా ఒక పైలెట్‌ (ఆపరేట్‌ చేయడానికి, ల్యాండింగ్‌, డ్రోన్‌ తప్పిపోకుండా శాస్త్రీయ శిక్షణ పొందిన వ్యక్తి) రీచార్జ్‌ చేస్తూ, బ్యాటరీలు మార్చడానికి ఒక వ్యక్తి, మ్యాపింగ్‌ చేయడానికి ఒక వ్యక్తి అవసరం.

వ్యవసాయంలో డ్లోన్‌ల విప్లవం
అంతకుముందు శాస్త్రవేత్త డా.సుధారాణి మాట్లాడుతూ డ్రోన్‌ వ్యవస్థ ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవచ్చన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్‌ సరికొత్త విప్లవం సృష్టిస్తుందని అన్నారు. డ్రోన్‌లు రైతులకు మేలు చేయడంతో పాటు యువతకు ఉపాధి కూడా చూపుతుందని పేర్కొన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలోని పొలంకు డ్రోన్‌తో మందులను పిచికారి చేసుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ రాజేశ్వర్‌రెడ్డి, సుజాత, యమున, సందీప్‌, వ్యవసాయ శాఖ ఏడీ రుద్రమూర్తి, వ్యవసాయ శాఖకు చెందిన మండల వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు.