డేంజర్ క్రిమినల్‌కు బేడీలు…!
– మూడేళ్లలో రెండు హత్యలు
– తప్పించుకు తిరిగిన నిందితుడు
– గంజాయి కేసులో పట్టుబడిన హంతకుడు
– వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: చేసిన పాపం పండితే.. తగిన శాస్తి తప్పదంటుంటారు. మూడేళ్లలో ఒకటి కాదు రెండు హత్యలు చేసి అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న కిరాతకుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. గంజాయి కేసులో పట్టుబడిని నిందితున్ని విచారించగా రెండు హత్య కేసులో నేరం అంగీకరించాడు. రెండు హత్యకేసులను చేధించిన వికారాబాద్ పోలీసులు సంచలనం సృష్టించారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. గురువారం వికారాబాద్ టౌన్ ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వికారాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి చేతిలో కవర్ పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని నమ్మదగిన సమాచారం అందింది. ఈ మేరకు ఎస్ఐ తన సిబ్బందితో వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర గంజాయి లభ్యం కావడంతో నిబంధనల ప్రకారం పోలీస్టేషన్‌కు తరలించారు.
బయటపడిన మూడేళ్ల క్రిందటి హత్య
నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అతని పేరు ఎండి. సల్మాన్‌గా గుర్తించారు. మరింత లోతుగా విచారించడంతో 2019లో జరిగిన హత్యకేసులో సల్మాన్ ప్రధాన నిందితుడని నిర్దారించారు. 2019 డిసెంబర్లో కల్యాణ్ బాబు అనే వ్యక్తిని హత్యచేసినట్లు గుర్తించారు. తన ప్రియురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు చంపేయాలని నిర్ణయించుకున్నాడు. తన పథకం ప్రకారం కల్యాణ్ బాబును వికారాబాద్ శివారెడ్డిపేట్ శివారులో గల ఒక బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి గంజాయి, మద్యం సేవించిన తరువాత కల్యాణ్ బాబు తాగిన మైకంలో ఉండగా సల్మాన్ అతన్ని బావిలో తోసేశాడు. అప్పట్లో వికారాబాద్ పోలీసులు కల్యాణ్ బాబు మృతదేహాన్ని గుర్తించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంంగా భావించి కేసు 174 CrPC ప్రకారం కేసు నమోదు చేశారు. ఇన్నేళ్ల తరువాత పట్టుబడిన గంజాయి కేసులో పాత నేరాన్ని సల్మాన్ అంగీకరించనట్లు ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు.
వ్యాపారంలో మోసం చేశాడని మరో హత్య
కల్యాణ్ బాబును చంపిన కేసులో సలీం తప్పించుకుని కొన్ని రోజులు హైదరాబాదులో ఉండి, మళ్ళీ వికారాబాద్ కు వచ్చాడు. తరువాత 2021లో గంజాయి వ్యాపారం చేసే క్రమంలో సల్మాన్‌కు నేపాల్‌కు చెందిన సురేశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సురేష్‌ది నేపాల్ అయినా వికారాబాద్‌లో ఉండేవాడు. అయితే సల్మాన్ కు తన సొంతూరు నేపాల్ నుండి గంజాయి తెప్పించి ఇస్తానని సురేష్ మాటిచ్చాడు. గంజాయి తెచ్చి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సల్మాన్‌ను సురేష్ కొట్టడంతో అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. ముందుగానే సల్మాన్ ఒక పథకం వేసుకున్నాడు. అప్పుడప్పుడు సురేష్, సల్మాన్ కలిసి గంజాయి, మద్యం సేవించే మద్దులగడ్డ తండా ప్రక్కన గల ఒక చిన్న గుట్ట పైన ఒక ఇనుప పైపును దాచిఉంచాడు. అవకాశం కోసం వేచిచూస్తున్న క్రమంలో అక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసి గంజాయి, మద్యం సేవించారు. పథకంలో భాగంగా సల్మాన్ కావాలనే సురేశ్ తో గొడవపడ్డాడు. సురేశ్ మద్యం మత్తులో ఉండగా ముందుగా దాచి ఉంచిన ఇనుప పైపుతో సల్మాన్ అతని తలపై బలంగా కొట్టి చంపినాడు.
అమ్మాయిని వేధించినందుకు మరో కేసు
కల్యాణ్ బాబు, సురేశ్ ను చంపిన తరువాత సల్మాన్ మళ్లీ తప్పించుకుని పరారిలో ఉన్నాడు. కొన్ని రోజులు హైదరాబాదులోని బేగంపేట్‌లో చికెన్ సెంటర్లో పనిచేశాడు. అక్కడ పనిచేస్తుండగా ఒక అమ్మాయిని వెంబడించి వేధించాడు. ఈ విషయంలో అతడిపై కేసు నమోదు అయ్యింది. సల్మాన్ అక్కడి నుంచి కూడ తప్పించుకొని వివిధ ప్రదేశాల్లో తిరిగాడు. తిరిగి వికారాబాద్‌కు తిరిగి వచ్చి గంజాయి కేసులో పట్టుబడి రెండు హత్య కేసులలో నేరాన్ని, బేగంపేట్ కేసులో నేరాన్ని అంగీకరించినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వివరించారు. రెండు హత్య కేసులలో నిందితుడిని పట్టుకున్నందుకు ఎస్పీ కోటిరెడ్డి ఎస్ఐ, సిబ్బందిని అభినందించి రివార్డ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ డిఎస్పి సత్యనారాయణ, వికారాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొనడం జరిగింది.

