కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్‌, బీజేపీల కుట్ర

జాతీయం తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్‌, బీజేపీల కుట్ర
– కవిత, బీఎల్ సంతోష్‌లను ఎందుకు అరెస్టు చేయరు
– రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఎంతో ముఖ్యం
– కేసీఆర్ పాలనలో రైతులకు ఒరిగిందేమి లేదు
– టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసింగించారు. 2018 ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఏకకాలంలో లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు దాన్ని నెరవేర్చలేదన్నారు. ధరణి సమస్యలతో పాటు పోడు భూముల ఇబ్బందులను పరిష్కాలనిపించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే ఇప్పటి వరకు చలనం లేదన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో నిరుపేదలైన 84 లక్షల మంది రైతులకు భూములు పంపిణీ చేసిందని ఇప్పుడు ధరణి పేరుతో ఆ భూములను ప్రభుత్వం లాక్కొని అమ్ముకుంటుందని ఆరోపించారు. రైతు బీమా రైతు బంధు పేరుతో రైతులకు వచ్చే సబ్సిడీ పరికరాలు , పంట నష్టపరిహారం ఇవేవీ అందడం లేదని పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రావలసిన ప్రాణహిత చేవెళ్లను పేరు మార్చి కాలేశ్వరం పేరుతో ఆయన ఫామ్ హౌసుకు నీటిని మలుపుకున్నాడని పాలమూరు నుంచి రావాల్సిన నీటిని రాకుండా చేస్తూ జూరాల నుంచి నీరు వృధాగా సముద్రంలో కలిసేలా చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై ధ్వజమెత్తారు. తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసేందుకే టీఆర్ఎస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితను, రాష్ట్రం బీఎల్ సంతోష్‌లను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. 2009 లో కొడంగల్ కు తాను కొత్త అయినా కడుపులో పెట్టుకొని గెలిపించారు. గుడి, బడి, రోడ్లు, బస్ డిపో, జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజ్ , సబ్ స్టేషన్లు కట్టించడం జరిగిందన్నారు. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి తప్పితే ఇంకేమి లేదని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదు. కేటీఆర్‌ దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. నిధుల కోసం ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని అన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అహర్నిషలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.