రైతులకు శుభవార్త..!
– ఈనెల 28 నుంచి రైతుబంధు
– రూ. 7వేల కోట్లను విడుదల చేయాలని సీఎం ఆదేశం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర రైతులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 28వ తేది నుంచి రైతుల ఖాతాలో రైతుబంధు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు ఆదేశాలు జారీ చేశారు. రైతు బంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు కలిపి ఎకరానికి రూ.పది వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత యాసంగికి సంబంధించి రైతులకు ఈ నెల 28 నుంచి రైతుబంధు సాయం అందనుంది. ఈ మేరకు పథకం కింద రూ.7,600 కోట్ల నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. కేంద్రం ఎన్ని ఆటంకాలు కల్పించినా జాప్యం, కోతలు లేకుండా నిధులను విడుదల చేయడం రైతాంగం, వ్యవసాయంపై తమ చిత్తశుద్ధికి నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు. వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.40 వేల కోట్లను కేంద్రం తొక్కిపెట్టి ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అయినప్పటికీ రైతుల సంక్షేమం, వ్యవసాయరంగ అభివృద్ది విషయంలో రాజీ పడకుండా రైతు బంధు నిధులను సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోందన్నారు. ఈసారి ఎలాంటి కోతలు లేకుండా రైతులందరికీ పూర్తి స్థాయిలో నిధులు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.

