బీసీలపై కేంద్రం నిర్లక్ష్యం

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

బీసీలపై కేంద్రం నిర్లక్ష్యం
– కుల గణన చేపట్టకుండా గోప్యం
– రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి ప్రాధాన్యం
– బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో బీసీల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరులో బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి హాజరైన చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మీడియాతో మాట్లాడారు. దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీసీలపై నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందన్నారు. జాతీయ బీసీ కమీషన్ కు రాజ్యాంగ బద్ధం కల్పించామన్నా కేంద్రం జాతీయ కమీషన్కు కార్యవర్గాన్ని నియమించడంలో జాప్యం చేస్తుందన్నారు. అన్ని రాష్ట్రాల విజ్ఞప్తి తరువాత కేవలం ఒక్క చైర్మన్ పదవిని మాత్రమే భర్తి చేయడంలో బీసీలపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చన్నారు. జాతీయ బీసీ కమీషన్ పూర్తిస్థాయిలో లేకపోవడంతో రాష్ట్రాల సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. వార్షిక బడ్జెట్లో 40 లక్షల కోట్లు ప్రవేశ పెడితే బీసీలకు రూ.946 కోట్లను మాత్రమే ప్రకటించిందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా కుల గణన పై కేంద్రం అనేక విషయాలను గోప్యంగా ఉంచుతుందని ఆరోపించారు. కుల గణన కోసం రూ. 5 వేకోట్ల ఖర్చు పెట్టిన కేంద్రం దాని గురించి ఇప్పటి వరకు స్పష్టమైన వివరాలను ప్రకటించడం లేదని అన్నారు. ఇప్పుడు కుల గణననే చేపట్టమని తేల్చి చెబుతుందన్నారు. కుల గణన చేపట్టి సమగ్ర వివరాలను అందించాలని కేంద్రాన్ని బహిరంగ లేఖలు రాయడం జరిగిందన్నారు. దీంతో పాటు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించాలని కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కుల గణనను చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోవడంతో కేంద్రం బీసీలతో చెలగాటం ఆడుతుందన్నారు. బీసీలపై సమగ్ర వివరాలను అందించాలని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామని అన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం బీసీల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందన్నారు. బీసీ కార్పోరేషన్, విద్య, ఉద్యోగ రంగాలలో బీసీ అభ్యున్నతికి సీఎం కేసీఆర్ సర్కారు కృషి చేస్తుందన్నారు. అనంతరం బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు తాండూరులోని భద్రేశ్వర దేవాలయం. వికారాబాద్లోని అనంత పద్మనాభ స్వామి దేవాలయాలను సందర్శించి స్వామి వార్లకు పూజలు నిర్వహించారు. ఆయన వెంట బీసీ కమీషన్ మెంబర్లు ఉపేంద్ర, కిషోర్ గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ కుమార్, ఇంచార్జ్ అధికారి భీంరావు తదితరులు ఉన్నారు.