రేషన్ కోటా కోత దుర్మార్గం
– పేదలను పస్తులుంచుతున్న ప్రభుత్వం
– పది కిలోల రేషన్ బియ్యం పంపిణీ చేయాలి
– బీజేపీ మహిళ మోర్చ అధ్యక్షురాలు సాహు శ్రీలత
తాండూరు, దర్శిని ప్రతినిధి: నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం కోత విధించడం దుర్మార్గమని బీజేపీ మహిళ మోర్చ వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు, తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ అన్నారు. మహిళ మోర్చ పిలుపు మేరకు శుక్రవారం సాహు శ్రీలత ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని 4, 23, 24, 31, 33 వార్డుల్లోని రేషన్ పంపిణీ దుకాణాలను సందర్శించారు. నిరుపేదలకు రేషన్ బియ్యం ఎన్ని కిలోలు అందిస్తున్నారని, కేంద్రం కోటా ఎంత.. రాష్ట్ర కోటా ఎంతా అని డీలర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాహు శ్రీలత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమ కోటాకింద దేశంలోని నిరుపేదలందరికి 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడ తమ కోటాను కలిపి పేదలకు 10 కిలోల రేషన్ బియ్యం అందించాల్సి ఉండగా కేంద్రం కోటా కింద 5 కిలోలను మాత్రమే పంపిణీ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోల కోటా అందించక పోవడంతో సంక్రాంతి పండగకు పేదలను పస్తులు ఉంచుతుందని విమర్శించారు. ఇప్పటికైనా పేదలకు 10 కిలోల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్ బంటారం లావణ్య, మహిళ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత, ఉపాధ్యక్షురాలు హరతి, అధికార ప్రతినిధి శృతి, పట్టణ అధ్యక్షురాలు ఉమా, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

