3న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
– ఆ రోజు నుంచే శాసనసభ, శాసనమండలి సమావేశాలు
– అందులోనే ఎన్నికల పద్దుపై రూపకల్పన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: వచ్చేనెల 3 నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. శనివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా బడ్జెట్ రూపకల్పనపైనా చర్చించారు. 3వ తేది మధ్యాహ్నం 12.10కి ప్రభుత్వం ఉభయసభల్లో విడివిడిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. శాసనసభ ప్రోరోగ్ కానందున ఈ సమావేశాలు సైతం గవర్నర్ ప్రసంగం లేకుండానే సాగనున్నాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాలను మూడు వారాలపాటు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. శాసనసభ తొలిరోజున సభా కార్యకలాపాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో చర్చించి ఎన్నిరోజులు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు, శాఖల వారీగా పద్దులపై విస్తృతంగా చర్చించే వీలుంది. మరోవైపు విపక్షాలు సైతం బడ్జెట్ సమావేశాలకు సన్నద్ధమవుతున్నాయి. వచ్చే ఎన్నికల కోణంలో అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దాన్ని పరిశీలించిన తర్వాత నిధులు లభ్యత ఆధారంగా తెలంగాణ బడ్జెట్‌కు సమాయత్తం కావడం ఆనవాయితీగా ఉంది. తొలిరోజే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించి, సమయం ఖరారు చేశారు. శాసనసభలో హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా… కౌన్సిల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమర్పిస్తారు.

