అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
– మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్
– గుమాస్తా నగర్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి: మహిళలు, ప్రజలు అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ అన్నారు. శుక్రవారం 26వ వార్డులోని గుమాస్తా నగర్ లో మాధుర్ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో తాండూరు అగ్నిమాపక శాఖ అధికారుల ద్వారా గ్యాస్ సిలిండర్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మరకాల రాఘవేందర్ మాట్లాడుతూ వంటిట్లో గాని లేదా ఇతర ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ల ద్వారా సంబవించే ప్రమాదాల నియంత్రణపై అగ్ని మాపక శాఖ అధికారులు సలహాలు, సూచనలు అందించడం అభినందనీయమన్నారు. ప్రమాదాలు సంబవించినప్పుడు వారు సూచించిన పద్దతులను పాటించాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలతో పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి నాగార్జున, మాధుర్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు, వార్డు మహిళలు పాల్గొన్నారు.

అధికారులు సూచించిన జాగ్రత్తలు
గ్యాస్‌ లీక్‌ అయితే!
గ్యాస్‌ లీకైనట్టు గమనిస్తే వెంటనే రెగ్యులేటర్‌ వాల్వు ఆపేయాలి.
ఇంట్లో కరెంట్‌ స్విచ్‌లు ఆన్‌/ ఆఫ్‌ చేయవద్దు.
దేవుని వద్ద పెట్టిన దీపాలు, అగర్‌బత్తీలు ఆర్పివేయాలి.
గాలి, వెలుతురు కోసం కిటికీలు, దర్వాజాలు తెరవాలి.
ఎల్పీజీ డిటెక్టర్‌ని వంటగదిలో ఏర్పాటుచేసుకోవాలి. దీనిలో సెన్సర్లు గ్యాస్‌లీకైనట్టు గుర్తిస్తే అలారం మోగిస్తాయి.

అగ్ని ప్రమాదం సంభవిస్తే..
అవకాశం ఉంటే రెగ్యులేటర్‌ వాల్వ్‌ ఆఫ్‌ చేయాలి. అవకాశం లేకపోతే తడిపిన గోనె సంచిని గాని, తడి బట్టనుగాని మండుతున్న సిలిండర్‌పై వేయాలి, మంట ఆగిపోతుంది. వెంటనే గ్యాస్‌ సిలిండర్‌ను ఖాళీ స్థలంలోకి తీసుకొచ్చి పెట్టాలి.