పంచాయతీరాజ్ శాఖలో పాపీ..!

క్రైం తాండూరు వికారాబాద్ హైదరాబాద్

పంచాయతీరాజ్ శాఖలో పాపీ..!
– ఏసీబీ వలలో యాలాల ఇంచార్జ్ ఏఈ
– రూ.30 వేలు తీసుకుంటూ దొరికిన ఉద్యోగి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా యాలాల మండలం పంచాయతీరాజ్ శాఖలో ఇంచార్జ్ ఏఈగా పనిచేస్తూ పాపపు సొమ్ముకు ఆశపడ్డాడు. కాంట్రాక్టర్ చేసిన పనులకు బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో లంచం తీసుకుంటుండగా అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. యాలాల పంచాయతీ రాజ్ ఇంచార్జ్ ఏఈ మధు పనిచేస్తున్నారు. అదే మండలంలో శాగ వెంకటయ్య కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారు. వెంకటయ్య మండలంలోని రాఘాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ. 5లక్షలతో డ్వాక్రా భవనం పూర్తి చేశారు. అదేవిధంగా జుంటుపల్లిలో మండల పరిషత్ నిధుల ద్వారా రూ.7లక్షల 72 వేలతో సీసీ రోడ్లు నిర్మించారు. ఈ పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు కూడ పూర్తయ్యాయి. బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ ఇంచార్జ్ ఏఈ మధును కోరారు. అయితే బిల్లులు చెల్లించేందుకు ఏఈ రూ. 39 వేలు డిమాండ్ చేశారు. చివరకు ఇద్దరి మద్య రూ.30వేలకు ఒప్పందం జరిగింది. అంతకుముందే కాంట్రాక్టర్ వెంకటయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పథకం వేశారు. ఇంచార్జ్ ఏ ఈ మధు హైదరాబాద్‌లోని మ‌లక్ పేట్ యశోధ ఆసుపత్రి వద్ద డబ్బులు ఇచ్చేందుకు రావాలని కాంట్రాక్టర్ వెంకటయ్యకు సూచించారు. అవినీతి అధికారిని పట్టుకునేందుకు అధికారులు అప్పటికే మాటు వేశారు. కాంట్రాక్టర్ వెంకటయ్య ఏఈ మధుకు డబ్బులు ఇచ్చే సమయంలో దాడిచేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఏసీబీకి చిక్కిన ఏఈ మధు కొంత కాలం క్రితమే యాలాల ఇంచార్జ్ ఏ ఈగా నియామకం అయ్యారు. అంతకుముందు కోడంగల్లో పనిచేశారు. అక్కడ కూడ ఏఈ మధు కాంట్రాక్టర్లను డబ్బుల కోసం వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎట్టకేలకు పాపపు సొమ్ముకు ఆశపడి ఏసీబీకి చిక్కాడు. హైదరాబాద్‌లో ఏసీబీకి చిక్కిన ఏఈని అక్క డే రిమాండ్ కు తరలిస్తామని ఆ శాఖ అధికారులు వెల్లడించారు.