కాక మీద కుర్చీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాక మీద కుర్చీ..!
– అవిశ్వాసంపైనే దృష్టి
– రంజుగా మారిన మున్సిపల్ రాజకీయం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలోని రాజకీయాలు ఎంతో ఆసక్తికరం. ట్విస్ట్‌ల మీద ట్విస్టులు అన్నట్లుగా సాగుతాయి. ఈ మద్య కాలంలో తాండూరు రాజకీయాలు రాష్ట్రంలో సంచలనంగా మారుతున్న సంఘటనలు అందరు గమనిస్తున్నారు. ప్రస్తుతం తాండూరు మున్సిపల్ కార్యాలయం రాజకీయాలపై అందరి దృష్టి పడింది. మున్సిపల్ కుర్చీ రాజకీయం మళ్లీ కాకరేపుతోంది. మొన్న జరిగిన మున్సిపల్ సమావేశంలో ఆధిపత్య రాజకీయాలు ఉత్కంఠతను రేపాయి. మున్సిపల్ చైర్ పర్సన్ పదవి విషయంలో ఎమ్మెల్సీ వర్గంకు చెందిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, ఎమ్మెల్యే వర్గంకు చెందిన పట్లోళ్ల దీపా నర్సింలు మద్య వార్‌ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇద్దరు మద్య జరిగిన రెండున్నరేళ్ల పదవి ఒప్పందం బెడిసి కొట్టడంతో ఇరు వర్గాల మద్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. చైర్‌ పర్సన్‌ను కుర్చీ దింపేదుకు వైస్ చైర్ పర్సన్ వర్గం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. వారి ప్రయత్నాలను కూడ చైర్ పర్సన్ వర్గం తగ్గేది లేదన్నట్లుగా పోటీ ఇస్తున్నారు. దీంతో మరో ప్రయత్నంగా చైర్‌ పర్సన్‌పై అవిశ్వాసంను ప్రయోగించబోతున్నారు. చైర్ పర్సన్‌ను కుర్చి దించడమే ధ్యేయంగా వైస్ పర్సన్ వర్గం వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైస్ పర్సన్‌ వర్గంలో మెజార్టీ కౌన్సిలర్లు మద్దతు తెలయడంతో అవిశ్వాసంపై ధీమా పెంచుకున్నారు. అవిశ్వాసం పెడితే తమ మద్దతు దారుల సంఖ్య మరింతగా పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లలో చీలిక ఏర్పడడంతో దానిని కాపాడుకునేందుకు దృష్టిసారిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ చైర్ పర్సన్ వర్గం నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టినా నెగ్గుకువస్తామని ధీమా ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్సీ సహాకారంతో మెజార్టీ కౌన్సిలర్లను కూడగట్టుకునేందుకు అన్నివిధాలుగా సమాయత్తంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇరువర్గాల మద్య కుర్చీ రాజకీయం రంజుగా మారింది. కుర్చీ ఆటలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందని అందరు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.