పోలీసు అభ్యర్థులకు ఊరట
– హైకోర్టు ఆదేశాలతో 7 మార్కులు
– కొత్త వారికి ఫిబ్రవరిలో దేహదారుఢ్య పరీక్షలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు ఊరట కలిగింది. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇటీవల ముగిసిన ప్రాథమిక రాత పరీక్షల్లో ఏడు ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ జవాబులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఆ ఏడు ప్రశ్నలకు.. ఏడు మార్కులు కలపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఈ నెల 24, 25 తేదీల్లో నియామక మండలికి అందాయి. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు 7 మార్కులు కలిపారు. కొత్తగా ఉత్తీర్ణులైన వారి వివరాలను జనవరి 30న నియామక మండలి వెబ్‌సైట్లో పొందుపరుస్తున్నారు. మరోవైపు కొత్తగా ఉత్తీర్ణులైన వారికి ఫిబ్రవరిలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి నిర్ణయించింది. ఈ మేరకు నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాస్‌రావు ఆదివారం షెడ్యూల్ ప్రకటించారు.
ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు
కొత్తగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యేందుకు నియామక మండలి వెబ్‌సైట్లోకి వెళ్లి పార్ట్-2 దరఖాస్తు చేయాలి. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 8 నుంచి 5వ తేదీ రాత్రి 10 గంటల మధ్య ఈ దరఖాస్తులు సమర్పించాలి. ఈ గడువు పెంపు ఉండదని మండలి ఛైర్మన్ స్పష్టం చేశారు. వీరికి ఫిబ్రవరి 15 నుంచి హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, ఆదిలాబాద్ కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 8 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి 12 గంటల మధ్య డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇబ్బందులు ఎదురైతే support@tslprb.inకు ఈమెయిల్ చేయాలని, లేదంటే 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

