ప్రమాదాలు లేని ప్రయాణాలే లక్ష్యం

ఆరోగ్యం క్రైం తాండూరు వికారాబాద్

ప్రమాదాలు లేని ప్రయాణాలే లక్ష్యం
– ప్రయాణికుల సురక్షితానికి ప్రాధాన్యం
– ఆర్టీసీ, ఆర్టీఏ, పోలీసు శాఖలు సమన్వయంతో సాగాలి
– వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: ప్రమాదాలు లేని ప్రయాణాలు సాగేలా అందరు దృష్టి సారించాలని, ప్రయాణికుల సురక్షితమే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆర్టీఏ, ఆర్టీసీ, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రజల సురక్షితమైన ప్రయాణం భాద్యత మనందరిపైన ఉందన్నారు. ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దృష్టిసారించాలన్నారు. అదే విధంగా జిల్లాలో వాహనదారులు రోడ్డు నియమాలను తప్పని సరిగా పాటించే విధంగా చూడాలన్నారు. ఆర్టీసీ స్టాండ్‌లలో ప్రైవేటు ప్యాసింజర్ వాహనాలు నిలిపకుండా చూడాలన్నారు. ఎవరైనా నిలిపితే కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్యాసింజర్ వాహనాలలో, ఆర్టీసీ బస్సులలో పరిమితికి మించి ప్రయాణకులను తరలించరాదన్నారు. ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చాలన్నారు. అదేవిధంగా ఆర్టీఏ అధికారులు నిరంతరం వాహనాలపైన నిఘా పెట్టాలని అన్నారు. నిబంధనలు పాటించకుండా నడిపే వాహనాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ అధికారులు కూడ ఎల్లప్పుడు అన్ని శాఖలతో సమన్వయం పాటిస్తారని అన్నారు. జిల్లాలోని అందరూ అధికారులు ఒకరితో ఒకరు సమన్వయంతో పని చేసి ప్రమాదాలు లేని ప్రయాణాలు సురక్షితంగా జరిగే విధంగా మంచి లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీ అదనపు అధికారి మురళీధర్, వికారాబాద్, పరిగి, తాండూరు డీఎస్పీలు, ఆర్టీఏ అధికారులు, ఆర్టీసీ అధికారులు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్, డీఏస్బీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.