ముక్కు మూసుకోవాల్సిందే..!

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

ముక్కు మూసుకోవాల్సిందే..!
– తాండూరు ఆర్టీసీలో కంపు రాజ్యం
– టాయిలెట్ల నిర్వహణ గాలికి
– పట్టించుకోని డీపో అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్టీసీ డీపోలో కంపు రాజ్యమేలుతోంది. అడిగే వారు లేక పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. దీంతో ప్రయాణికులకు, వెంట వచ్చిన వారు ఎవరైనా సరే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే తాండూరు ఆర్టీసీ డీపోకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి రోజూ తాండూరు డీపో నుంచి వివిధ మార్గాలలో వేల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తోంది. వికారాబాద్‌ జిల్లాతో పాటు హైదరాబాద్, కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాలకు తాండూరు డీపో నుంచి బస్సు సర్వీసులను అందిస్తున్నారు. నిత్యం వేల మంది ప్రయాణికులు డీపోకు వస్తూ పోతుంటారు. ప్రయాణికుల ఒకటి.. రెండు అవసరాల కోసం బస్టాండ్‌లో నిర్వహిస్తున్న టాయిలెట్ వ్యవస్థ కంపు మయంగా మారింది. ఇక్కడి టాయిలెట్ వ్యవస్థలో మూత్రానికి ఉచిత సేవలు అందిస్తుండగా మరుగుదొడ్డికి మాత్రం రూ. 5 లు వసూలు చేస్తున్నారు. మహిళలకు ఉచితంగా సేవలను అందిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మరుగుదొడ్డి, మూత్రశాలలు కంపు కొడుతున్నాయి. ఎంతలా అంటే సమీపంలోని చిరు వ్యాపారుల దుకాణాల వద్దకు కంపు వాసన ముక్కుపుటలను అదరగోడుతుందని పలువురు ప్రయాణికులు అంటున్నారు. లోపలికి వెళ్లాలంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ మూత్రశాలలను శుభ్రం చేసేందుకు ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించినట్లు డిపో అధికారులు చెబుతున్నా అక్కడ అలాంటి పనులు ఏవి జరగడంలేదని స్థానికులు అంటున్నారు. డీపో మేనేజర్ ఈ వ్యవస్థపై ఎలాంటి దృష్టి సారించడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి టాయిలెట్ల నిర్వహణను పక్కాగా నిర్వహించాలని… కంపు సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.