దృష్టి పెడితే.. గ్రూప్స్ ఈజీ..!
– పోటీ ఉద్యోగ సాధనే ధ్యేయం కావాలి
– రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్
– బీసీ స్టడీ సెంటర్ విద్యార్థులకు మెటీరీయల్ పంపిణీ
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడంపై దృష్టి పెడితే గ్రూప్స్‌లో కొలువులు ఈజీగా సాధించవచ్చని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తాండూరు డివిజన్ బీసీ స్టడీ సర్కిల్ లో గ్రూప్-3, 4 శిక్షణ పొందిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శిక్షణ పొందిన యువతి యువకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-3,4 లో 10,500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉద్యోగాలకు సిద్దమైన అభ్యర్థుకలు బీసీ వేల్పేర్ ద్వారా మూడు నెలల ముందు నుండే సంబంధిత సబ్జెక్టుల పైన శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. శిక్షణ పొందిన యువత తప్పనిసరిగా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు సంపాదించి జిల్లాకు మంచి పేరు తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎటువంటి అపనమ్మకం, అపోహలకు తావూనీయకుండా నిజాయితీగా చేపట్టడం జరుగుతుందని యువతకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల పేదలకు పోటీ పరీక్షల్లో తర్ఫీదు నిచ్చేందుకుగాను బీసీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ ఇచ్చి వివిధ అంశాల్లో నిపుణులైన వారిచే నాణ్యమైన స్టడీ మెటీరియల్ ను సిద్ధం చేసి అందించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు దీటుగా బీ.సీ. స్టడీ సర్కిల్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగిందని కమిషన్ సభ్యులు తెలిపారు. జిల్లాలో రెండు బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని జిల్లా కేంద్రంతో పాటు తాండూరు డివిజన్ లో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకొని 95 మందికి పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకోవడం సంతోషదాయకమని అన్నారు. మరోవైపు తాండూరు ప్రాంతానికి స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేసిన బీ.సీ. కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ కు శిక్షణ పొందిన యువతీ, యువకులు కృతజ్ఞతలు తెలిపారు. స్టడీ సర్కిల్ ఏర్పాటుతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న మాకు ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. ఇక మీదట మాలాంటి నిరుద్యోగులకు స్టడీ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, డి బి సి డబ్ల్యూ ఉపేందర్, అసిస్టెంట్ బీ సి డబ్ల్యూ భీమ్ రాజ్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

