ఖర్చులేకుండా పోస్టాఫీసు ఖాతా..!
– సిబ్బంది ఇంటికొచ్చి తెరుస్తారు
– పాత ఖాతాదారులకు ఆన్‌లైన్ సేవలు
– వినియోగదారులు ఏం చేయాలంటే
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: మీకు పోస్ట్ ఆఫీస్‌లో ఖాతా లేని వారికి ఈ సమాచారం మీకు ఉపయోగపడనుంది. పోస్టాఫీసులో ఖాతా తెరుచుకోవాలని అనుకునేవారికి ఆ శాఖ సువర్ణ అవకాశం కల్పిస్తుంది. ఖర్చు లేకుండా.. సిబ్బందే ఇంటికి వచ్చి ఖాతా తెరిచే వెసులుబాటు కల్పిస్తుందని అధికారులు చెబుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా శాఖ ఎన్నో సేవలను విస్తృత పరుస్తోంది. ఇందులో భాగంగా తపాలా కార్యాలయాలకు వెళ్లి సేవలు పొందడం కాదు.. సిబ్బందే ఇంటికొచ్చి సేవలందించే వ్యవస్థను తీసుకవచ్చింది. ఆన్‌లైన్లో సేవలపై హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని 40 పట్టణాల్లో ప్రచారాన్ని తపాలాశాఖ ప్రారంభించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి నెలాఖరుకు 50 వేల నూతన ఆన్‌లైన్ ఖాతాలు తెరవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తపాలాశాఖ సహాయ సంచాలకులు సీహెచ్.రామకృష్ణ తెలిపారు. ఈ సేవలకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఖాతా తెరవాలనుకునే వారు ‘పోస్ట్ ఇన్ఫో’ (www.indiapost.gov.in) అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకొని.. అందులో చిరునామా, ఇతర వివరాలు నమోదు చేసి సర్వీస్ రిక్వెస్ట్ నమోదు చేయాలి. ఆ వెంటనే ఇంటికి తపాలా ఉద్యోగి వచ్చి ఖాతా తెరిచేందుకు అవసరమైన దరఖాస్తును పూరించడంలో సహకరిస్తారు. ఖాతా తెరిచాక.. పాస్‌పుస్తకం తెచ్చిస్తారు. ఇప్పటికే తపాలా పొదుపు ఖాతా ఉన్నవారు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లోనే రికరింగ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను తెరిచే వెసులుబాటూ ఉంది. మరింత సమాచారానికి టోల్‌ఫ్రీ నంబర్ 8002666868లో సంప్రదించొచ్చు.

