ఒకే ఒక్క రూపాయి కోసం..!

జాతీయం తెలంగాణ హైదరాబాద్

ఒకే ఒక్క రూపాయి కోసం..!
– మూడేళ్లు న్యాయపోరాటం చేసిన ప్రయాణికుడు
– రూ. 15వేలు చెల్లించాలి బస్సు కండక్టర్‌కు తీర్పు
దర్శిని డెస్క్‌: టీ కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్, ఆటో నుంచి ఆర్టీసీ బస్సు దాక చాలా సందర్భాలలో చిల్లర లేదనే సాకు వల్ల రూపాయిని చాలా మంది వదిలేసుకుంటారు. ఇలాంటి సంఘటనలు సాధారణమే. అయితే ఓ బస్సు ప్రయాణికుడు మాత్రం తనకు రావాల్సిన ఒకే ఒక్క రూపాయి కోసం మూడేళ్లు న్యాయపోరాటం చేశాడు. ఈ క్రమంలో తనకు అవరోధాలు ఎదురైనా.. అండ దక్కకున్నా లెక్కచేయలేదు. బెంగళూరులోని బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్‌ కోర్టు(బీఎంటీసీ) ఇచ్చిన తీర్పును ఇప్పుడు వైరల్‌గా మారింది. 2019లో రమేష్ నాయక్ అనే వ్యక్తి శాంతినగర్ నుంచి మెజెస్టిక్ బస్ డిపోకు బీఎమ్‌టీసీ బస్సులో ప్రయాణించాడు. ఆ సమయంలో ప్రయాణికులు రూ.30 ఇవ్వగా.. కండక్టర్ రూ.29కి టిక్కెట్ ఇచ్చాడు. తనకు ఇంకా ఒక రూపాయి రావల్సి ఉందని, ఇవ్వమని ప్రయానికుడు కోరాడు. ఐతే కండక్టర్ మాత్రం తన దగ్గర రూపాయి చిల్లర లేదని చెప్పాడు. అంతటితో ఆగకుండా సదరు ప్రయాణికుడిపై కండక్టర్ దుర్భాషలాడాడు కూడా. దీంతో మనస్తాపానికి గురైన రమేష్ తనకు రూ.15 వేలు పరిహారం ఇవ్వాలని కోరుతూ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఐతే రమేష్ ఫిర్యాదును స్వీకరించకపోగా కండక్టర్‌కే సపోర్టు చేస్తూ.. సర్వీస్‌లో లోపం ఉందన్న ఆరోపణలతో పిటిషన్‌ను కోర్టు కొట్టిపారేసింది. అనంతరం రమేష్‌ బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కోర్టు (బీఎంటీసీ)లో అఫిడవిట్ దాఖలు చేశాడు. వాదనలు విన్న కోర్టు కండక్టర్ ఒక రూపాయితోపాటు ఫిర్యాదుదారుడు కోరిన రూ.15 వేలు చెల్లించాలని సూచించింది. ఈ సమస్యను లేవనెత్తడం చిన్నదిగా అనిపించినా.. అది వినియోగదారుడి హక్కును సంబంధించిన అంశంగా గుర్తించాలని పేర్కొంటూ.. ఈ పని చేసినందుకు కోర్టు అతన్ని అభినందించింది. అంతేకాకుండా తీర్పు ప్రకారం ప్రస్తుతం రూ.2,000 చెల్లించాలని, లీగల్ ఫీజు కింద రూ.1,000 చెల్లించాలని బెంగళూరు కోర్టు (బీఎంటీసీ) ఆదేశించింది. మిగిలిన మొత్తం 45 రోజుల్లో చెల్లించాలని, అలాచేయని పక్షంలో ఏడాదికి రూ.6 వేల చొప్పున వడ్డీ చెల్లించవల్సి ఉంటుందని కోర్టు తన తీర్పులో వెలువరించింది.