సమస్యలు లేని స్వగృహ ఇండ్లకే వేలం..!
– బహిరంగ వేలంలో ఎవరైనా పాల్గొవచ్చు
– సౌకర్యాలు కల్పించి అన్ని చింతలు తీరుస్తాం
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
– కొనుగోలుదారులకు ఫ్రీబిడ్ సమావేశం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: కొనుగోలు దారులకు సమస్యలు లేని రాజీవ్ స్వగృహ ఇండ్లను అందించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సీ.నారాయణ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో యాలాల మండలం కోకట్ గ్రామ పరధి హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న రాజీవ్ స్వగృహ మనోహా టౌన్‌షిఫ్‌లో ఉన్న ప్లాట్ల బహిరంగ వేగంపై ఫ్రీ బిడ్డింగ్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ అప్రూవ్డ్ లేఅవుట్, అన్ని సదుపాయాలతో ఎలాంటి సమస్యలు లేని 54 గృహాలు, 14 ఓపెన్ ప్లాట్లకు ఈనెల 17, 18 తేదీలలో బహిరంగ వేలం వేయనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. ఇందులో మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్తు లాంటి అన్ని సదుపాయాలు సమకూర్చడం జరుగుతుందన్నారు. 100 గజాల నుండి250 గజాల విస్తీర్ణం గల ప్లాట్లను మధ్యతరగతి వారికి ఉపయోగపడే విధంగా ఉంటాయని అన్నారు. గతంలో బహిరంగ వేలం నిర్వహించి విక్రయించిన తర్వాత మిగిలిపోయిన ప్లాట్లను, గృహాలను మరొకసారి బహిరంగవేలం నిర్వహించి విక్రయించడం జరుగుతుందన్నారు. వేలం పాటలో అత్యధిక పాట పాడి ప్లాట్లను దక్కించుకునే వారు మొత్తం డబ్బులు ఒకేసారి చెల్లించిన వారికి రెండు శాతం సబ్సిడీ అందించడం జరుగుతుందని, అలాగే 90 రోజులలో మూడు విడతలుగా కూడా చెల్లించవచ్చని తెలియజేశారు. ఇట్టి బహిరంగ వేలంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్లాట్లు, గృహాలను సొంతం చేసుకోవాలని అన్నారు. ప్లాట్లను సొంతం చేసుకున్న తర్వాత ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని భావిస్తారని అన్నారు. వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని, ఇందుకు వారు రూ. 10వేల డీడిని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ధర తగ్గిస్తే మంచిది
అంతకుముందు ఫ్రీబిడ్ సమావేశంలో పాల్గొన్న కొనుగోలు దారులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాజీవ్ స్వగృహలో గజం ధర రూ. 10వేలు ఎక్కువ అయ్యిందని అన్నారు. గజం ధర రూ. 5వేలు, లేదా 7 వేలు తగ్గిస్తే పేద, మద్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉంటుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని కలెక్టర్ బదులిచ్చారు. మరోసారి ఈనెల 10న మళ్లీ ఫ్రీబిడ్డింగ్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా 17,18వ తేదిలో మాత్రం బహిరంగ వేలం ఖచ్చితంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ ఐఏఎస్ సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ అశోక్ కుమార్, తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, ఎంపీడీఓ సుదర్శన్ రెడ్డి, డీఎస్పీ శేఖర్ గౌడ్ , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

