ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
– అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్
– ముగ్గురు అభ్యర్థులకు చాన్స్ ఇచ్చిన అధినేత
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలోని ఎమ్మెల్యే కోటా కింద ముగుస్తున్న ఎమ్మెల్యే స్థానాల అభ్యర్థుల ఎంపిక ఖరారయ్యింది. ఆ మూడు స్థానాల అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిలను ఎంపిక చేసినట్లు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 3 శాసన మండలి స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ముగ్గురు శాసనమండలి సభ్యుల పదవీకాలం.. ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. ఆ లోగా కొత్త సభ్యుల నియామకం కోసం గులాబీ పార్టీలో కసరత్తులు మొదలైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఎంపిక చేసిన అభ్యర్థులు ఈ నెల 9వ తేదీన నామినేషన్ వేయాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.

