హోలీ.. విషాధ జలకేళీ..!
– కాగ్నానదిలో నీట మునిగి విద్యార్థి మృతి
– కాపాడే ప్రయత్నం చేసిన దక్కని ప్రాణం
– తాండూరు మల్‌రెడ్డిపల్లిలో విషాధం
తాండూరు, దర్శిని ప్రతినిధి : హోలీ.. తరువాత సరధాగా జలకాలాడేందుకు వెళ్లిన ఓ విద్యార్థి నీట మునిగి మృతి చెందాడు. పైకి తీసుకవచ్చిన స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రాణం దక్కలేదు. ఈ విషాధకర సంఘటన తాండూరులో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం మల్ రెడ్డిపల్లికి చెందిన గొల్ల మాధవికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రైవేటు జాబ్ చేస్తుండగా రెండో కుమారుడు గొల్ల ప్రదీప్ (18) మెడ్చల్ మల్లా రెడ్డి కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

గత మూడు రోజుల క్రితమే తాండూరుకు వచ్చాడు. మంగళవారం హోలీ సంబరాల తరువాత స్నేహితులతో కలిసి తాండూరు కాగ్నా చెక్ డ్యాం వద్దకు వెళ్లాడు. అక్కడ నీటిలో దిగి స్నానం చేస్తుండగా ప్రమాద వశాత్తు నీటమునిగాడు. గమనించిన స్నేహితులు పైకి తీసుకవచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో వెంటనే తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే ప్రదీప్ మరణించాడు. ఈ సంఘటనతో మల్ రెడ్డిపల్లిలో విషాధం నెలకొంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు.మరోవైపు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తాండూరు పట్టణ పోలీసులతో పాటు యాలాల పోలీసులు కూడ దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాలను త్వరగా వెల్లడిస్తామని తెలిపారు.

