ధరణి సమస్యలన్నింటిపై శ్రద్ద
– మనసుపెట్టి పనిచేసి పరిష్కరించాలి
– పట్టా పాసుపుస్తకాలు, రైతుబంధు అందేలా చర్యలు
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారులు ధరణి సమస్యల పరిష్కారానికి అధికారులు శ్రద్ద వహించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం టెలికాన్ఫెరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దారులతో ధరణి సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు నెల రోజుల నుండి రెవెన్యూ సిబ్బంది అందరూ కష్టపడి పనిచేసి ఎక్కువ మొత్తంలో ధరణి సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. అర్హులైన రైతులను గుర్తించి వారికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు మనసుపెట్టి పనిచేసి వారికి న్యాయం చేయాలని సూచించారు. తప్పుడు పనులు చేసి ఇబ్బంది పడవద్దని, క్లియర్ టైటిల్, పొజిషన్ లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ సంకల్పం మేరకు ధరణి ద్వారా భూ సమస్యల పరిష్కారం కావాలి తప్ప, కొత్త సమస్యలు సృష్టించరాదన్నారు. ఒక రెవెన్యూ అధికారికి తప్పు చేసినట్లు చెడ్డ పేరు రాకుండా అందరూ బాగా పనిచేయాలని సూచించారు. ఒక పట్టాదారుకు సంబంధించిన ఒక గుంట భూమి కూడా అన్యాయంగా ఇంకొకరికి మార్చకూడదని సూచించారు. ప్రభుత్వానికి సంబంధించిన అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు ఎక్కడైనా పొరపాటున పట్టా భూములుగా పడినట్లయితే వాటిని గుర్తించి సరిచేసి సంరక్షించాలన్నారు. కోర్టు కేసుల విషయంలో పూర్తి జాగ్రత్తలు వహించి పరిశీలించిన పిదపనే ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు. ధరణి సమస్యల పరిష్కారానికి సంబంధించిన నివేదికలు, రికార్డులను కలెక్టర్ కు పంపేటప్పుడు స్పష్టంగా తప్పులు లేకుండా జాగ్రత్తగా అందించాలన్నారు. జి ఎల్ ఎమ్, సక్సెషన్ పనులకు తప్పనిసరిగా 2010 సంవత్సరపు పహానిలను జతపరచాలని సూచించారు. అర్హులైన రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు, రైతుబంధు డబ్బులు అందేలా పనిచేయాలని అన్నారు. వచ్చే రెండు నెలలు కష్టపడి పని చేసినట్లయితే దాదాపు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ తెలిపారు.

