తాండూర్‌లో టగ్‌ ఆఫ్‌ వార్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూర్‌లో టగ్‌ ఆఫ్‌ వార్..!
– పార్టీకి ఒక కార్యక్రమం
– ప్రజా క్షేత్రంలోకి నేతలు
– కాక పుట్టిస్తున్న పోలిటికల్‌ ఎత్తులు
– జై కొట్టేదెవరికో అన్నదే ఆసక్తికరం
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశ, రాష్ట్ర రాజకీయాలకు ఏమాత్రం తీసిపోవు వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు రాజకీయాలు. చాలా సందర్భాలలో పోలిటికల్ వ్యవహారాలు రుజువు చేశాయి. రానున్నది ఎన్నికల రోజులు రావడంతో స్థానికంగా రాజకీయాలు వేడేక్కాయి. పార్టీకి ఒక కార్యక్రమం పేరుతో చేపడుతున్న ఎత్తులతో తాండూరులో టగ్‌ ఆఫ్‌ వార్ తప్పదేమో.. అన్నట్లుగా సామాన్యుడు ఆలోచించేలా రాజకీయా పరిణామాలు మారుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వంటి పార్టీల నేతలు ఈ మద్య కాలంలో ప్రజాక్షేత్రంలోనే బీజిగా ఉంటున్నారు. కార్యకర్తలతో పాటు ఓటర్లను ఆకర్షించేలా హామిలు గుప్పిస్తున్నారు. చివరికి ప్రజలు ఎవరికి జై కొడతారన్నేదే అందరిలో ఆసక్తిని రేపుతోంది.

కేసీఆర్ ఆదేశాలతో…
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై అందరి చూపు సీఎం కేసీఆర్‌పైనే ఉండేది. కాని ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అయినా బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికి కీలక ఆదేశాలు జారీ చేశారు.

నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రత్యేక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఇటీవలే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం యాలాల మండలంలో కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. అదేవిధంగా తాండూరు టిక్కెట్టు కోసం పట్టు మీద ఉన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సైతం స్థానిక నేతలు, ప్రజలతో మమేకంగా ఉండేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నారు. నాగర్‌ కర్నూర్‌ జిల్లాకు ఇంచార్జ్ గా ఉంటూనే తాండూరుపై దృష్టిసారించి నేతలకు, కార్యకర్తలకు భరోసా అందిస్తున్నారు.

హస్తంలో హవా..
తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి ఇతర పార్టీలకు పోటీ ఇచ్చే గట్టి బలం ఉంది. ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని తపిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ కార్యక్రమాలతో శ్రమిస్తోంది. పార్టీ పిలుపు మేరకు హత్‌ సే హాత్‌ జోడో కార్యక్రమంతో చెమటోడుస్తోంది.

తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతులకు, పేదలకు ఎలాంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్‌ మండలం, తాండూరు మండలంలో చేపట్టిన కార్యక్రమం ప్రస్తుతం తాండూరు పట్టణంలో కొనసాగుతోంది. అయితే ఈ కార్యక్రమంలో పట్టుమని 30 మంది నేతలు, కార్యకర్తలు మాత్రమే పాల్గొనడంతో పార్టీకి ప్రధాన మైనస్‌గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

జోష్‌ మీదున్న బీజేపీ
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని అందరి మాట. దీంతో బీజేపీ పార్టీ తాండూరులో పుల్‌ జోష్‌ మీద ఉంది. పార్టీ పిలుపు మేరకు ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో ప్రజాక్షేత్రంలో పర్యటిస్తోంది.

బీఆర్ఎస్‌ చేస్తోన్న అప్రజాస్వామిక పాలన, సీఎం కేసీఆర్‌ మోసాలను వివరిస్తూ ప్రజలకు, కార్యకర్తలకు చేరువ అవుతోంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఎన్నికల్లో గెలిచేలా ఫోకస్ పెట్టింది. కాని తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది స్పష్టంగా లేకపోవడంతో ప్రజలు అయోమయంలో ఉన్నారని ప్రతిపక్ష పార్టీల విమర్శలు ఉన్నాయి.