డ్రోన్ టెక్నాల‌జీ విప్ల‌వాత్మ‌కం..!

జాతీయం టెక్నాలజీ తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

డ్రోన్ టెక్నాల‌జీ విప్ల‌వాత్మ‌కం..!
– కొత్త పాల‌సీపై స్ప‌ష్టంగా మోడీ ప్ర‌భుత్వం
– కేంద్ర విమాన‌యాన మంత్రి జ్యోతిరాధిత్య
– కొత్త టెక్నాల‌జీ ఎంతో ఉప‌యోగం : మంత్రి కేటీఆర్
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: దేశంలో డ్రోన్ల టెక్నాల‌జీ విప్ల‌వాత్మ‌క‌మ‌ని, కొత్త టెక్నాల‌జీ విష‌యంలో మోడీ ప్ర‌భుత్వం స్ప‌ష్టమైన విధానాన్ని అవ‌లంబిస్తోంద‌ని కేంద్ర విమానాయాన మంత్రి జ్యోతిరాధిత్య పేర్కొన్నారు. దేశంలో మొట్టమొద‌టి సారి డ్రోన్ల ద్వారా మెడిసిన్ డెల‌వ‌రీ కోసం చేప‌ట్టిన మెడిసిన్ ఫ్ర‌మ్ ద స్కై కార్య‌క్ర‌మానికి శ‌నివారం ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించారు. వికారాబాద్​ జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన‌ “మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టును కేంద్ర విమానాయాన మంత్రి జ్యోతిరాధిత్య తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో క‌లిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య‌ మాట్లాడుతూ సాంకేతికతను అందించడమే ప్రధాని మోదీ స్వప్నమని చెప్పారు. “మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టుకు ప్రధాని మార్గనిర్దేశం చేశారని వెల్లడించారు. డ్రోన్ పాలసీపై కేంద్రానికి స్పష్టమైన ఆలోచన క‌లిగి ఉంద‌న్నారు. డ్రోన్ టెక్నాలజీ ప్రపంచానికి కొత్త కాంతిని తీసుకొస్తుందని పేర్కొన్నారు. గ్రహంబెల్ టెలిఫోన్, రైట్ బ్రదర్స్ విమానం లాగే డ్రోన్ టెక్నాలజీ ఓ విప్ల‌వాత్మ‌కంగా నిలుస్తుందని తెలిపారు. సాంకేతికతలో మోదీ ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుందన్నారు. “సాంకేతికత వల్ల దేశ యువశక్తి ప్రపంచానికి తెలుస్తుంది.
అంకుర సంస్థలను తేలిగ్గా చూడొద్దని, చిన్న పరికరం అత్యవసర స్థితిలో మందులను మోసుకెళ్తోంద‌న్నారు. ప‌ని గంట‌లు, రాత్రిప‌గ‌లు తేడా లేకుండా మందుల‌ను డెలివ‌రి చేసే విధాన్ని అన్ని రాష్ట్రాల్లో విస్త‌రిస్తామ‌న్నారు. అన్ని రాష్ర్టాలతో కలిసి గ్రీన్ జోన్లో ఏర్పాటు చేసి డ్రోన్ లకు నిబంధనలు లేకుండా నడపడానికి అనుమతులు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా ఏరోస్పేస్ టెక్నాలజీలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, ఇంటరాక్టివ్‌ ఏరోస్పేస్‌ మ్యాప్‌ తయారు చేయబోతున్నామని అన్నారు. ఇంటరాక్టివ్‌ ఏరోస్పేస్‌ మ్యాప్‌నకు సంబంధించిన ప్రత్యేకతలను వివరించారు. అంత‌కుముందు రైతులు ,వైద్యులు నాదృష్టిలో ప్రపంచాన్ని నిలబెట్టే దాతలని అభివర్ణించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ భారత దేశంలో మొదటి సారి డ్రోన్‌ల ద్వారా మందులు పంపిణీ చేయడం సంతోషక‌ర‌మ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రోన్ల వినియోగంపై ఎంత‌మేర‌కు లాభ‌మ‌నే విష‌యాల‌పై సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టిసారిస్తున్నార‌ని అన్నారు. ప్ర‌స్తుతం ప్రారంభించిన డ్రోన్ల వ్య‌వ‌స్థ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో కావాల్సి మందులను , రక్తాన్ని వ్యాక్సిన్ ఐదు నిమిషాల్లో చేరవేయ వచ్చ‌న్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడ ఈ అత్యాధునిక టేక్నాలజీ ట్రాఫిక్ జామ్ లేకుండా మందుల‌ను చేర‌వేయ‌వ‌చ్చ‌న్నారు. ఆరోగ్య రంగంలోనే కాదు అనేక రంగాల్లో డ్రోన్ వాడొచ్చని తెలిపారు. మహిళల భద్రత కోసం కూడా డ్రోన్లను వినియోగించ‌వ‌చ్చ‌ని, అమ్మాయిలను వేధించే వాళ్లు డ్రోన్ చప్పుళ్లకే భయపడతారని వెల్లడించారు.
మైనింగ్ లాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాలను కట్టడి చేయవచ్చన్నారు. అదేవిధంగా బేగంపేట విమానాశ్రయాన్ని ఏరోస్పేస్ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఏవియేషన్ వర్సిటీగా మార్చాలని కేంద్ర మంత్రిని సింధియాను కోరారు. ఏవియేషన్ వర్సిటీ తీసుకొస్తే ఎంతోమంది యువతకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. వికారాబాద్ కొత్త కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభిస్తారని చెప్పారు.

డ్రోన్ డెల‌వ‌రీ స‌క్సెస్
దేశంలోనే మొట్ట మొద‌టి సారి వికారాబాద్ జిల్లా కేంద్రంలో డ్రోన్ల్ ద్వారా ఔష‌దాల‌ను పంపించే మెడిసిన్ ఫ్ర‌మ్ స్కై పైలెట్ ప్రాజెక్టు స‌స్కెస్ అయ్యింది. ఔషధాల బాక్సులను కేంద్ర మంద్రి జ్యోతిరాధిత్య‌ సింధియా డ్రోన్​లో పెట్టగా.. 3 డ్రోన్లలో ప్రయోగాత్మకంగా మందులు, టీకాలను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి పంపించారు. ఔషధాలను 2 కి.మీ. దూరంలో ఉన్న వికారాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి డ్రోన్‌ విజయవంతంగా డెలివరీ చేసింది. సరఫరా చేసిన అనంతరం తిరిగి డ్రోన్‌ వేదిక వద్దకు చేరుకుంది.
ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య‌, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డిలు డ్రోన్లతో ఔషధాలు పంపుతున్న యువతకు అభినందనలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ట్నం సునితా మ‌హేంద‌ర్‌రెడ్డి, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్‌రెడ్డి, కాలే యాద‌య్య‌, మ‌హేష్ రెడ్డి, ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డి, చేవేళ్ల ఎంపీ గ‌డ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణీ, జిల్లా క‌లెక్ట‌ర్ కె.నిఖిల‌, బీసీ క‌మీష‌న్ స‌భ్యులు శుభ‌ప్ర‌ద్ ప‌టేల్, వికారాబాద్ మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ మంజుల త‌దిత‌రులు పాల్గొన్నారు.