ట్రాఫిక్ ఫోలీస్టేషన్ ఫైనల్..!
– ఈ సేవా భవనంలో ఏర్పాటు
– చర్యలు చేపడుతున్న అధికార యంత్రాంగం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరులో ట్రాఫిక్ పోలీస్టేషన్ ఏర్పాటు చేయాలనే కల త్వరలో నెరవేరబోతోంది. పట్టణంలో ట్రాఫిక్ పోలీస్టేషన్ ఏర్పాటు చేసేందుకు భవనాన్ని కూడ ఖరారు చేస్తున్నారు. తాండూరులో ట్రాఫిక్ పోలీస్టేషన్ ఏర్పాటు కోసం పోలీసు శాఖ శ్రమిస్తోంది. కొన్నేండ్ల క్రితం పాత తాండూరులోని పోలీస్ క్వార్టర్స్‌లో సూచన ప్రాయంగా ట్రాఫిక్ పోలీస్టేషన్ నిర్వహించారు. అందుకు స్థలం అనువుగా లేకపోవడంతో పట్టణంలో ఏర్పాటు చేయాలని భవనాలను పరిశీలించారు. ఇదే క్రమంలో పట్టణంలోని శాంతినగర్‌లో ఉన్న ఈసేవా భవనాన్ని ట్రాఫిక్ పోలీస్టేషన్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఈ భవనాన్ని ట్రాఫిక్ పోలీస్టేషన్‌కు కేటాయించాలని తాండూరు మున్సిపల్ పాలకవర్గం కూడ ఎజెండాలో ఆమోదించింది. దీంతో ఈ సేవా భవనంలో ట్రాఫిక్ పోలీస్టేషన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయ్యింది. తాజాగా మున్సిపల్ అధికారులు ఈసేవా భవాన్ని ట్రాఫిక్ పోలీస్టేషన్‌కు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు మున్సిపల్, పోలీసు శాఖ అధికారులు భవాన్ని పరిశీలించారు. భవనంలో ట్రాఫిక్ పోలీస్టేషన్ కోసం కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై పరిశీలన చేశారు. త్వరలోనే ఈసేవా భవనంలో ట్రాఫిక్ పోలీస్టేషన్ అందుబాటులోకి వస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

