భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అద్దె బస్సులు..!
– తాండూరు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్
– డిపో నుంచి తొలి సూపర్ లగ్జరీ బస్సు బుకింగ్
– పందళరాజ ఆశ్రమం సభ్యులకు సర్వీస్
తాండూరు, దర్శిని ప్రతినిధి: భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ అద్దె బస్సులను అందుబాటులో ఉంచడం జరుగుతోందని తాండూరు డీపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

సోమవారం అయ్యప్ప స్వాముల శబరిమల యాత్ర కోసం తాండూరు పందళరాజ ఆశ్రమం ఆధ్వర్యంలో టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బుకింగ్ పూర్తయింది. ఆశ్రమ గురుస్వామి హనుమయ్య గౌడ్ ఆధ్వర్యంలో తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును ఆరు రోజుల యాత్ర కోసం రిజర్వ్ చేశారు. తాండూరు డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు బుకింగ్ కావడం ఇదే తొలిసారి.

మొత్తం 3,400 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.2,24,589 చార్జీగా నిర్ణయించగా, రూ.50 వేల అడ్వాన్స్ చెల్లించారు. అయ్యప్ప భక్తుల ప్రయాణ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బస్సును బుక్ చేసినట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ అద్దె బస్సులను అందుబాటులో ఉంచుతోందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ యాత్రలను పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిపో సిబ్బంది నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


