ముగిసిన డబుల్ గడువు..!
– పొడగింపుపై అధికారుల అస్పష్టత
– ఐదు రోజులుగా మొత్తం 9436 దరఖాస్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో డబుల్ బెడ్ రూం ఇండ్ల దరఖాస్తుల స్వీకరణ గడువు అధికారుల ప్రకటన మేరకు శనివారంతో ముగిసింది. గడుపు పొడగింపుపై లబ్దిదారుల అభ్యర్థనలు వెలువెత్తున్నట్లు తెలిసింది. మొత్తంగా తాండూరులో డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం 9436 దరఖాస్తులు అందాయి. హైదరాబాద్ రోడ్డు మార్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులైన పేదలకు అందించేందుకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చొరవతో ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి తాండూరు పట్టణానికి సంబంధించి డబుల్ బెడ్ రూం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పట్టణంలోని 36 వార్డులకు సంబంధించి 6 దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6 వార్డులకు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఆరోగ్య కేంద్రం వద్ద, కొత్త మున్సిపల్ కార్యాలయం, పాత తాండూరు బస్తీ దవాఖాన, రైతు బజార్, పాత మున్సిపల్ కార్యాలయంలో 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం చివరి రోజు సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఆరు కేంద్రాల్లో మొదటి రోజు 2196, రెండో రోజు 2832, మూడో రోజు 2046, నాలుగో రోజు 1374, చివరి రోజు శనివారం 988 ద దరఖాస్తులు అందాయి. ఐదు రోజులుగా అందిన దరఖాస్తులతో మొత్తం 9436కు లబ్దిదారుల సంఖ్య చేరిందని తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు తెలిపారు. ఈ నివేధికను జిల్లా కలెక్టర్కు అందజేయడం జరుగుతుందని, కలెక్టర్ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు చేపడుతామని తహసీల్దార్ తెలిపారు. మరోవైపు లబ్దిదారులు గడువు ముగిసినా తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి దరఖాస్తులను సమర్పిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో దరఖాస్తుల గడువును పొడగించాలని కోరినట్లు సమాచారం. అయితే గడువు పొడగింపుపై అధికారుల నుంచి స్పష్టత రాలేదు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

