స‌గం సాయం సొంతింటికి..!

తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

స‌గం సాయం సొంతింటికి..!
– ద‌ళిత బంధులో రూ. 5ల‌క్షల‌తో ఇంటి నిర్మాణం
– ప్ర‌త్యామ్నాయంపై ప్ర‌భుత్వ ప‌రిశీల‌న
– ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్న అధికారులు
– అమలుపై సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణ‌యం
ద‌ర్శిని డెస్క్ : తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెడుతున్న ద‌ళిత బంధు సాయాన్ని ల‌బ్దిదారుల‌కు మ‌రింత ప్ర‌యోజ‌నం చేకూరేలా క‌స‌ర‌త్తును ప్రారంభించింది. ఈ ప‌థ‌కం కింద అందిస్తున్న రూ. 10 ల‌క్ష‌ల ఆర్ధిక సాయంలో స‌గం అంటే రూ. 5 ల‌క్ష‌ల‌తో వారి సొంతింటి నిర్మాణం చేసుకునేలా వెసులుబాటు క‌ల్పించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తుంది. ల‌బ్దిదారుల నుంచి వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు స‌మ‌చారం. ఇంత‌కుముందు ల‌బ్దిదారుల చేత వ్యాపారం, వృత్తి ప‌ర‌మైన చేయూత‌ను అందించాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ద‌ళిత బంధు కోసం నియోజ‌క‌వ‌ర్గాల వారిగా క్షేత్ర‌స్థాయిలో నిర్వ‌హించిన స‌ర్వేలో అధిక‌మంది సొంత స్థ‌లం ఉంటే ఇంటి నిర్మాణానికి వినియోగించుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. ఈ అభిప్రాయాల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుక‌రావ‌డంతో దీనిపై స‌ర్కారు కస‌ర‌త్తును ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు అధికారులు ప్ర‌తిపాద‌న‌లు కూడ సిద్దం చేయ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. అయితే ద‌ళిత బంధు స‌గం సాయం సొంతింటి నిర్మాణానికి వినియోగించాల‌నే దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే తుది నిర్ణ‌యం తీసుకుంటార‌ని అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఇదే క‌నుక ఫైన‌ల్ అయితే అర్హులైన వారు స‌గం సాయంతో సొంతింటి నిర్మాణం, మిగిలిన సాయంతో జీవనోపాధి పొందేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ప‌లువురు ల‌బ్దిదారులు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.