అక్రమ ఇసుక దందాకు చెక్..!
– అమ్మకానికి ప్రభుత్వ ఇసుక
– రూ. 600లకే ట్రాక్టర్ సాండ్
– మరో పది రోజుల్లో కొత్త విధానం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక దందాకు చెక్ పడబోతోంది. ప్రభుత్వం ద్వారానే నిర్మాణాలకు ఇసుకను అమ్మేందుకు చర్యలు చేపట్టేందుకు సన్నద్దమవుతున్న నేపథ్యంలో అక్రమ దందాకు కళ్లెం పడిపోతోంది. ఈ కొత్త విధానాన్ని మరో పది రోజుల్లోనే అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కోడంగల్, యాలాల, బొంరాస్‌పేట్, పెద్దేముల్, బషీరాబాద్ మండలాలతో పాటు తదితర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా జోరుగా జరుగుతోందని ఆరోపణలు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ముఖ్యంగా కాగ్నా, కాకర వేణి, మూసి నదులతో పాటు వాగులు, అడవుల్లోని కాలువల నుంచి తవ్వకాలు జరుపు తున్నారు. రాత్రి వేళల్లో ఇసుక దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. గనుల శాఖ, నీటి పారుదల, రెవెన్యూ, పోలీసు, అటవీశాఖల అధికారుల మధ్య సమన్వయ లోపంతో అక్రమార్కులు తవ్వకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు జిల్లాలో అనధికారికంగా సుమారు వేయి ట్రాక్టర్లకు పైగా తరలిస్తున్నారు.
రూ. 30 లక్షల నుంచి 50 లక్షల వరకు వ్యాపారం
వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కోడంగల్, యాలాల, బొంరాస్‌పేట్, పెద్దేముల్, బషీరాబాద్ మండలాలతో పాటు తదితర ప్రాంతాల్లో నిత్యం ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్ రీచ్‌ల నుంచి తరలిస్తున్న ఇసుకను వ్యాపారులంతా సిండికేట్‌గా మారి విక్రయిస్తున్నారు. నాణ్యతను బట్టి ట్రాక్టరు ఇసుక ధర రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఉంది. రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ తప్పని పరిస్థితిలో నిర్మాణదారులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో వ్యాపారులు రూ.30లక్షల నుంచి రూ.50లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఇక్కడ మరో కీలక అంశం ఏమంటే.
పక్కగా ప్రభుత్వ ఇసుక అమ్మకాలు
ఇసుకను ప్రభుత్వమే విక్రయించేందుకు సిద్ధమవుతోంది. అక్రమ తవ్వకాలకు ఇక ముగింపు లభించనుంది. మరో పది రోజుల్లో ఈ విధానం అమల్లోకి రానుంది. ఇకపై అధికారికంగా ఇసుక అమ్మకాలు చేయడంతో.. నదీ పరీవాహక గ్రామాల్లో భూగర్భ జలమట్టం పడిపోకుండా ఇసుక ఎక్కువగా ఉండే చోట తవ్వకాలు జరుపుతారు. ధర నిర్ణయం తదితర అంశాలు జిల్లా పాలనాధికారి ఛైర్మన్‌గా ఉన్న కమిటీ నిర్ణయిస్తుంది. తాజాగా విక్రయించే ఇసుక ట్రాక్టరుకు ధర రూ.600గా అధికారులు నిర్ణయించారు.
నిర్మాణాల కోసం కావాల్సిన వారు తహసీల్దార్ల నుంచి అనుమతి తీసుకొని కొనుగోలు చేసుకోవొచ్చు.
అక్రమాలకు పాల్పడితే…
కొత్త విధానంలో అమలు చేయబోతున్న విధానంలో ఎలాంటి అక్రమాలకు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇసుక రవాణాపై నిరంతర నిఘా ఉంచేలా చర్యలు చేపట్టబోతున్నారు. ఎవరైనా అనధికారికంగా తవ్వకాలు జరిపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. దీంతో పాటు ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లు జీపీఎస్‌తో అనుసంధానం చేసి ఉంటాయి. ఫలితంగా అక్రమ రవాణాను అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా రవాణా చేస్తూ ట్రాక్టర్లు పట్టుబడితే మొదటిసారి రూ.25 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి దొరికితే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు.

