ఎస్ఐ, ఏఎస్ఐ పరీక్షల కీ రిలీజ్
– ప్రకటించిన బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు
– ఈనెల 17వరకు అభ్యంతరాలకు గడువు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : పోలీసు శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్రం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐ (సివిల్, ఐటీ అండ్ సీఓ, పీటీఓ) తత్సమాన పోస్టులు, ఏఎ్‌సఐ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల ప్రిలిమినరీ కీని రీలీజ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆ శాఖ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఆర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్, జనరల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ, రెండు నాన్ టెక్నికల్ అంశాలకు సంబంధించి ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. నేడు శనివారం నుంచి టీఎ్‌సఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో కీని అందుబాటులో ఉంచుతామని చైర్మన్ వీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రిలిమినరీ కీలో ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 17 వరకు వెబ్‌సైట్ ద్వారా స్వీకరిస్తామన్నారు. మిగతా పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీ వివరాలను తదుపరి విడుదల చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు.

