క్రమబద్దీకరణకు మూడో చాన్స్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

క్రమబద్దీకరణకు మూడో చాన్స్..!
– 125 గజాల్లోని పేదలకు ఫ్రీ
– గతంలో అవకాశం లేని, తిరస్కరణ దారులకు అవకాశం
– మీసేవా కేంద్రాల్లోనే అర్హుల ఆర్జీలు స్వీకరణ
– డీఆర్‌ఓ, తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమిత భూముల క్రమబద్ధీకరించేందుకు మూడో సారి చాన్స్ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌ఓ, తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ అన్నారు. గురువారం తాండూరు ఆర్డీవో కార్యాలయంలో స్థానిక మీసేవా నిర్వహకులతో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 58,59 క్రమబద్ధీరణ దరఖాస్తుల స్వీకరణపై దిశ, నిర్దేశం చేశారు. అనంతరం ఆర్డీఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రభుత్వ స్థలాలను అక్రమించుకుని నివాసాలు ఏర్పరుచుకున్న వారి భూముల క్రమబద్ధీకరణ కోసం జీవో 58,59లను ప్రవేశ పెట్టిందన్నారు. జీవో నెంబర్ 58 కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ప్రభుత్వ స్థలాల్లో భూమిని ఆక్రమిస్తే 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీరణ చేయడం జరుగుతుందున్నారు. 59 జీవో కింద మార్కెట్ విలువ మేరకు ప్రభుత్వం సూచించిన రుసుము చెల్లింపుతో క్రమబద్ధీరణ చేయడం జరుగుతుందన్నారు.

ఈ సారి గడువు పెంపు
ప్రభుత్వం తీసుకవచ్చిన 58, 59 జీవోల కింద లబ్దిదారులకు గడువులు పెంచిందన్నారు. మొదటి సారి 2022 ఫిబ్రవరిలో క్రమబద్ధీరణపై మరో జీవో 14ను తీసుకవచ్చి రెగ్యూలరైజ్ కు అవకాశం కల్పించిందన్నారు. తాజాగా ఈ యేడాది గత నెల జీవో 29ను తీసుకవచ్చిందని గుర్తుచేశారు. గతంలో 2014 జూన్ 2 వ తేదికి ముందు ఆక్రమణలో ఉన్న భూముల క్రమబద్ధీకరణకు చాన్స్ ఇస్తే ఈ సారి 2020 జూన్ 2 వ తేది వరకు ఆక్రమణలో ఉన్న భూములను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు.

అవకాశం లేని, తిరస్కరణ ఆర్జీలకు అవకాశం
రెండు పర్యాయాలు క్రమబద్ధీకరణకు గడువు ఇచ్చినా అవకాశం సద్వినియోగం చేసుకోలేని వారితో పాటు గతంలో పెట్టిన దరఖాస్తులు తిరస్కరణ అయిన వారు కూడ ఈ సారి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలో ఉన్నప్పటికీ అభ్యంతరాలు లేని వాటిని మాత్రమే క్రమబద్దీకరిస్తామని, స్మశాన వాటికలు, చెరువు శిఖం భూములు, రహదారులను ఆక్రమించి అభ్యంతరాలకు గురైన భూములను రెగ్యూలరైజ్ చేయడం జరగదని స్పష్టం చేశారు.

మీ సేవాలోనే దరఖాస్తుల సమర్పణ
అర్హులైన పేదలు, లబ్దిదారులు క్రమబద్ధీకరణ కోసం మీసేవా కేంద్రాల్లోనే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 30వ తేది వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందన్నారు. అది కూడ 2020 జూన్ 2నాటికి ఇళ్ల నిర్మాణాలు, వాణిజ్య నిర్మాణాలు చేపట్టిన వారే అర్హులని స్పష్టం చేశారు. మీసేవా నిర్వహకులు ఆర్జీ దారుల నుంచి అక్రమణ స్థలాలకు సంబంధించిన విద్యుత్ బిల్లు రశీదు, ఆస్తి పన్ను చెల్లింపు రశీదు, కుళాయి బిల్లు చెల్లింపు రశీదుతో పాటు దృవపత్రాలు ఉంటేనే దరఖాస్తులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, ఆర్ఎస్ఐ రాజీరెడ్డి, మీసేవా నిర్వహకులు పాల్గొన్నారు.