కట్టించిన దాంట్లోనే చివరి మజిలీ

క్రైం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

కట్టించిన దాంట్లోనే చివరి మజిలీ
– స్మశాన వాటికలో సర్పంచ్‌వే తొలి అంత్యక్రియలు
– దురదృష్టకర సంఘటన ఎక్కడ జరిగిందంటే
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: అనుకోనివి జరిగితేనే విధి వింతనాటకాలు జరుగుతాయి. సర్పంచ్ కట్టించిన స్మశాన వాటికలోనే అతని తొలి అంత్యక్రియలు జరుగుతాయని ఎవ్వరు అనుకుని ఉండరు. అలాంటి దురదృష్టకరమైన సంఘటన తెలంగాణ రాష్ట్రం హనుమకొండలో చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబోతుపల్లి గ్రామ సర్పంచ్‌ కంచ కుమారస్వామి (25) ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తన హాయాంలో వైకుంఠ దామాన్ని నిర్మించారు. అయితే అది ప్రారంభానికి నోచుకోలేదు. ఇంతలో తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల కారణంగా సర్పంచ్‌ కుమార స్వామి ఇంట్లో కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే అతని భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్థాపానికి గురైన సర్పంచ్‌ ఏప్రిల్‌ 29న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కుమారస్వామి హయాంలో నిర్మించిన వైకుంఠధామంలోనే అంత్యక్రియలు జరిపితే ఆయనకు గౌరవం ఇచ్చినట్లు ఉంటుందని గ్రామస్థులు ఒక నిర్ణయానికి వచ్చారు. అధికారికంగా ప్రారంభం కాకుండానే తొలి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు.