దేశంలో ఎమర్జెన్సి దిశగా బీజేపీ పాలన
– నాన్ బీజేపీ సర్కార్లపై ముప్పుతిప్పలు
– ప్రభుత్వాలపై బీజేపీ ఆగడాలు మితిమీరాయి
– కేంద్రంపై మండిపడిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : దేశంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా బీజేపీ పాలన కొనసాగిస్తుందని, బీజేపీ అధికారంలో లేని ప్రభుత్వాలపై ముప్పుతిప్పులు పెడుతోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఆగడాలు, అరాచకాలు మితిమీరిపోతున్నాయని ద్వజమెత్తారు. శనివారం ప్రగతి భవన్లో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.దేశంలో కేంద్ర ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో చాలా సందర్భాల్లో నాన్ బీజేపీ ప్రభుత్వాల వెంబడి పడుతున్నాయి. రకరకాల దాడులు చేస్తూ బెదిరిస్తున్నారు. అనేక దుర్మార్గాలకు పాల్పడుతోందన్నారు. ఇటీవలి కాలంలో ఢిల్లీలో రెండు సార్లు కాదు.. మూడు సార్లు అద్భుతమైన విజయం సాధించిన ఘనత ఆప్ పార్టికి ఉందని గుర్తుచేశారు. ఈ మధ్యకాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా స్పస్టమైన ఆధిక్యంతో ఆప్ విజయం సాధించిందని తెలిపారు. దీనికి బీజేపీ ఎన్నో రకాలుగా, కుయుక్తులు చేసినా ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారన్నారు. అయినా మేయర్‌ను ప్రమాణస్వీకారం చేసేందుకు ముప్పుతిప్పలు పెట్టిందన్నారు.
సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత ప్రమాణం చేయాల్సి వచ్చిందని వివరించారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తెచ్చి ఊపిరాడకుండా, అనేక దుర్మార్గ చర్యలకు పాల్పడుతుంది. కేజ్రీవాల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఐదు సభ్యులతో కూడిన బెంచ్ స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కిందనే అధికారులందరూ పని చేయాల్సి ఉంటుంది. కచ్చితంగా ప్రభుత్వం చెప్పినట్లు వినాలి. గవర్నర్ల చేతుల్లో ఉండరాదు అని కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను కూడా కాలరాశారు. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఇవాళ భయంకరంగా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఎమర్జెన్సీని వ్యతిరేకించే బీజేపీ నేతలు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇందిరా గాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలోని బీజేపీ వెళ్తోంది. బీజేపీకి ఢిల్లీ ప్రజలు మరోసారి తగిన బుద్ధి చెబుతారు. కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు.
నాన్ బీజేపీ పార్టీలు ఏకం కావాలి
సీబీఐ, ఈడీలతో బెదిరిస్తూ.. ప్రభుత్వాలను కూల్చివేస్తున్నారని బీజేపీపై ఢిల్లీ సీఎ కేజ్రీ ఆరోపణలు చేశారు. నాన్ బీజేపీ సర్కార్లను కూల్చివేయడం బీజేపీకి అలవాటు అయ్యిందన్నారు. దేశవ్యాప్తంగా తాను ప్రజల తరపున తిరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ గవర్నరే పాలన చేయాలనుకుంటే, అప్పుడు ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. నాన్ బీజేపీ పార్టీలు అన్ని ఒక్కటి అయితేనే బీజేపీ ఢీకొట్టగలమన్నారు. దేశ ప్రజల్లో విశ్వాసం నింపాలన్నారు. ఆజాదీని రక్షించుకోవాలంటే మోదీని ఓడించాలని కేజ్రీ పిలుపునిచ్చారు.
దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాము పోరాటం చేస్తున్నట్లు పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్ తెలిపారు. నీతి ఆయోగ్ మీటింగ్ ఇవాళ ఢిల్లీలో జరుగుతోందని, కానీ అక్కడ చేసేది ఏమీలేదని, అందుకే తాము ఆ మీటింగ్‌ను బహిష్కరించినట్లు ఆయన చెప్పారు. మీటింగ్‌లను తమకు నచ్చినట్లే నిర్వహిస్తున్నారని భగవంత్‌మాన్ విమర్శించారు.


