జింక పేరుతో కుక్క మాంసం..!
– గ్రామాల్లో విక్రయించిన దుండగులు
– దొంగలించిన కుక్కను చంపి ఘోరం
– సీసీ కెమెరాల ద్వారా బయటపడిన బాగోతం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: జింక మాంసం అంటూ దొంగలు కుక్క మాంసం విక్రయించారు. పెంపుడు కుక్కను ఎత్తుకెళ్లి చంపి ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని లక్ష్మణచందా మండల కేంద్రానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి పెంపుడు కుక్కను అదే మండలంలోని పొట్టెపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, చామన్పెల్లి గ్రామానికి చెందిన వరుణ్ దొంగలించారు. తమతోపాటు తీసుకెళ్లి గుట్టుచప్పుడు కాకుండా.. చంపి.. చుట్టుపక్కల ఊర్లలో జింకమాంసం పేరుతో అమ్మేశారు. చుట్టూ అడవులు ఉండేసరికి నిజంగానే జింకమాంసం అనుకుని.. కొందరు కొనుక్కున్నారు కూడా. అయితే కుక్క యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పట్టుకుని విచారణ చేపట్టారు.
స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా మండలంలోని పొట్ట పెళ్లి (కె) గ్రామానికి చెందిన శ్రీనివాస్ చమన్ పల్లి గ్రామానికి చెందిన వరుణ్ అనే వ్యక్తులు అపహరించినట్లు గుర్తించారు. కుక్కను దొంగిలించే తతంగం అంతా తెలిసిపోయింది. ఆకుక్కను ఎక్కడో చంపేసి జింకమాంసం పేరుతో అమ్మేశామని తాపీగా చెప్పారు. ఈ విషయాన్ని పోలీసులే వెల్లడించారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు లక్ష్మణ్ చందా పోలీసులు.. అసలు సంగతిని బయట పెట్టారు.
ఇది కూడా చదవండి…


