హానెస్ట్‌కి హ్యాట్సాఫ్..!
– నిజాయితీకి చాటుకున్న యువకుడు
– రూ. 20 వేలు, పాసు పుస్తకం అప్పగింత
– అభినందించిన తాండూరు పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బంకు ప్రవీణ్ అనే యువకుడు ప్రదర్శించిన హానెస్ట్‌కి పోలీసులు, పట్టణ వాసులు హ్యాట్సాఫ్ చెప్పారు. ఓ మహిళ పోగొట్టుకున్న పొలానికి సంబంధించిన పాసు పుస్తకంతో పాటు రూ.20 వేల నగదు తిరిగి అందించడంలో కీలకంగా మారాడు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన పోకల పద్మమ్మ తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న ఎస్వీఆర్ హాస్పిటల్ వద్దకు వచ్చింది. ఆమె వెంట తెచ్చుకున్న కవర్లో ఉన్న పాసు పుస్తకంతో పాటు రూ. 20 వేల నగదును కవర్ తో పాటు పోగొట్టుకుంది. అదేసమయంలో తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన బంకు ప్రవీణ్ కుమార్ కు రూ. 20 వేల నగదు, పాసు పుస్తకం ఉన్న కవర్ దొరికింది. వెంటనే తాండూరు పట్టణ పోలీస్టేషన్ కు వచ్చి తనకు దొరికిన కవర్ ను పోలీసులకు అందజేశాడు.
వివరాలు ఆరా తీసిన పోలీసులు బాధితురాలు పోకల పద్మమ్మకు సమచారం అందించారు. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సమక్షంలో పద్మమ్మకు పోగొట్టుకున్న కవర్ ను అందజేశారు. మరోవైపు మహిళ పోగొట్టుకున్న రూ.20 వేలకు ఆశపడకుండా నిజాయితీగా పోలీసులకు అప్పగించిన బంకు ప్రవీణ్ ను పోలీసులు అభినందించి సన్మానించారు. ఇదే స్ఫూర్తితో అందరు ఉండాలని, తగిన సందర్భాలలో ప్రజలు తమ నిజాయితీని చాటుకోవాలని పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సూచించారు. పోగొట్టుకుపోయిన కవర్ ను తిరిగి అందించడంపై పద్మమ్మ పోలీసులకు, బంకు ప్రవీణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి…


