చెట్టినాడుపై రైతుల ఆగ్రహం
– జేసీబీతో రైల్వేట్రాక్ పట్టాలు ఎత్తివేత
– పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాన్యం
– కర్మాగారం యజమాన్యంపై ఫిర్యాదు చేసిన రైతులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మండల సరిహద్దు.. కర్ణాటక రాష్ట్రంలోని చెట్టినాడు సిమెంట్ కర్మాగారంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్మాగారానికి చెందిన రైల్వే ట్రాక్‌ను జేసీబీతో పట్టాలను ఎత్తేశారు. దీంతో పంచాయతీ పోలీస్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం సంగెంకలాన్ సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలో చెట్టినాడు సిమెంట్ కర్మాగారం కొనసాగుతోంది. గత కొన్నేండ్ల క్రితం కర్మాగారం సిమెంట్ ఉత్పత్తుల రవాణా కోసం తాండూరు మండలంలోని కోటబాస్పల్లి, గుంతబాస్పల్లి, సంగెంకలాన్ గ్రామాలతో పాటు మల్కాపూర్ గనికార్మిక సంఘంకు చెందిన 15, 116 సర్వే నెంబర్లలో భూమిని కొనుగోలు చేసింది. అదేవిధంగా ట్రాక్ నిర్మాణం కోసం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రసాద్ అనే వ్యక్తి పనులు పూర్తి చేశారు.
భూములు కోల్పోయిన కొంత మంది రైతులకు యజమాన్యం పరిహారం అందించింది. మల్కాపూర్ గనికార్మిక సంఘంతో పాటు ఇంకా కొంత మంది రైతులకు పరిహారం ఇవ్వకపోవడంతో వారు యజమాన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కు కూడా డబ్బులు చెల్లించలేదు. తాజాగా సోమవారం కోటబాస్పల్లి గ్రామానికి చెందిన రైతులు సర్వేనెంబర్ 68లోని రైతులు కర్మాగారానికి చెందిన రైల్వే ట్రాక్ ను తొలగించారు. జేసీబీ యంత్రాలతో పట్టాలను ఎత్తివేశారు. ఈ విషయం తెలుసుకున్న కర్మాగారం యజమాన్యం ట్రాక్ తొలగించిన రైతులపై కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా రైతులు కూడా పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న కర్మాగారం యజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్టేషన్ కు పరస్పర ఫిర్యాదులు వెళ్లాయి.
ఇది కూడా చదవండి…

