అదిగో.. ఎన్నికల కోడ్..!
– ముందే కూస్తున్న నేతలు
– నాలుగు రోజులంటూ సంకేతాలు
– వేగం పుంజుకున్న రాజకీయాలు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమంతా అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ అంటుకుంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అధికారుల్లో, నేతల్లో, కార్యకర్తల్లో, ఓటర్లలో ఉత్కంఠ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అదిగో ఎన్నికల కోడ్ అంటూ అధికారులు, నేతలు సంకేతాలు ఇస్తున్నారు. మూడు రోజుల క్రితం వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ పేరుతో కూడా ఓ పత్రికలో ఎన్నికల కోడ్‌పై ప్రకటన వచ్చింది. తాజాగా వికారాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేసీఆర్ సైతం నాలుగు రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని హింట్ ఇచ్చారు.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ పర్యటించింది. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు అమల్లోకి వచ్చినా సిద్ధంగా ఉండేందుకు అన్ని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే ఢిల్లీ నుంచి అందిన అప్డేట్స్ ప్రకారం అక్టోబర్ 10న ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాలకు కోడ్ అఫ్ కండక్ట్ ను అమలు చేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైందని సమాచారం. తెలంగాణతో పాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అన్నింటికీ అక్టోబర్ 10న ఎలక్షన్ కోడ్ ను అమలు చేసేందుకు ఈసీ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
ఇందుకు తగ్గట్లుగా అధికార పార్టీ బీఆర్ఎస్‌తో ఎన్నికల కోడ్ ను దృష్టిలో ఉంచుకుని వేగం పెంచింది. పబ్లిక్ మీటింగ్ లు, శంకుస్థాపనలు అంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. షెడ్యూల్ కు ముందే తమ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న వర్క్స్ కు శంకుస్థాపనలు, అక్కడక్కడ పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలలో, పార్టీలలో, ప్రజల్లో ఎన్నికల కోడ్ ఎప్పుడైనా రావచ్చని తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
కోడ్ అమల్లోకి వస్తే..?
అధికారంలో ఉన్న పార్టీలు తమ అధికారాలు కోల్పోయి. నామమాత్రపు అధికారాలను పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ డబ్బును ప్రచారానికి వాడకూడదు. ఖర్చుపెట్టకూడదు. టీవీలు, పేపర్లలో ప్రకటనలు ఇవ్వకూడదు. ప్రభుత్వం పేరు వాడుకునేందుకు వీలు ఉండదు. అదే విధంగా కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రజలను ప్రభావితం చేసే కొత్త స్కీమ్ ప్రకటించకూడదు. దీనివల్ల ఎన్నికల నిర్వహణ పక్కదారి పట్టే అవకాశం ఉంటుందని ఈ నిబంధన.
మంత్రులు అధికారిక హోదాల్లో పర్యటనలు చెయ్యకూడదు. ప్రభుత్వ వాహనాలు వాడకూడదు. అధికార పార్టీ కూడా ప్రభుత్వ వాహనాలు, యంత్రాల్ని వాడకూడదు. ప్రత్యర్థి పార్టీల సభలు, ప్రచార ర్యాలీలకు ఎలాగైతే అనుమతులు ఇస్తారో… అదే విధంగా అధికార పార్టీ చేపట్టే ర్యాలీలు, సభలకు కూడా అనుమతులు ఉండాలే తప్ప… అదనంగా ఎలాంటి ప్రత్యేకతలూ ఉండకూడదు. హెలీప్యాడ్ల వాడకం, గ్రౌండ్‌ల వంటివి అన్ని పార్టీలకూ సమాన దృష్టితో కల్పించాలి.
ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, పదోన్నతుల వంటివి ఉండకూడదు. ఆల్రెడీ ఉద్యోగాలకు ముందే ప్రకటనలు ఇచ్చి వుంటే వాటి నియామకం మాత్రం చేపట్టవచ్చు. పార్టీలైనా, నేతలైనా విమర్శలు చేసేటప్పుడు ప్రత్యర్థుల పనితీరుపై మాత్రమే విమర్శలు, ఆరోపణలు చెయ్యాలి. అంతే తప్ప వ్యక్తిగత దూషణలు, కుల, మత పరమైన అంశాల జోలికి వెళ్లకూడదు. మసీదులు, చర్చిలు, ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల దగ్గర ఎన్నికల ప్రచారం చెయ్యకూడదు.
తాయిలాలు ఇవ్వడం, డబ్బు ఇవ్వడం, మందు, బిర్యానీ ఇవ్వడం, బహుమతులు ఇవ్వడం ఇవన్నీ నేరమే. ఎన్నికలు ఏ రాష్ట్రంలోని ఏ ఏరియాలో జరిగినా, 48 గంటల ముందు అన్ని పార్టీలూ, నేతలూ ఎన్నికలు జరిగే నియోజక వర్గాల్లో ప్రచారాన్ని ఆపేయాలి.
ఇది కూడా చదవండి…

