మంటలంటుకుని కారు దగ్దం..!
– తాండూరు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఘటన
– ఫైర్ సిబ్బంది ద్వారా ప్రమాదం అదుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మంటలు అంటుకుని ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి చెందిన వైద్యులు డా.కళ్యాణ మోహన్ తన కారు(టీఎస్04 ఈఎస్ 2300)లో సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తన కారులో హైదరాబాద్ నుంచి కోడంగల్ మీదుగా తాండూరుకు వస్తున్నారు.
పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు రాగానే కారులో పెట్రోల్ అయిపోయింది. ఈ క్రమంలో కారును పదే పదే స్టార్ట్ చేయడంతో కారులోని బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అర్పేందుకు ప్రయత్నించినా అదుపుకాలేదు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అబ్దుల్ రావూఫ్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే మంటలు తీవ్రం కావడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. కారులో మంటలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటనలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రాకపోకలు స్థంభించాయి. జరిగిన ప్రమాదంపై వైద్యుని ఫిర్యాదుతో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి…

