సరిహద్దులతో అప్రమత్తం ముఖ్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సరిహద్దులతో అప్రమత్తం ముఖ్యం..!
– చెక్ పోస్టులలో ప్రత్యేక నిఘా పెట్టాలి
– మద్యం, డ్రగ్స్. డబ్బుల తరలింపుపై దృష్టి తప్పనిసరి
– శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
– జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో కలిసి చెక్ పోస్టులు పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల సమయంలో సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలని, చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం, తాండూరు మండలంలోని సరిహద్దులో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో కలిసి పర్యటించారు. తాండూరు మండలంలోని కరణ్ కోట్, కొత్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు, రెవెన్యూ, అబ్కారీ శాఖల అధికారులు సమన్వయంతో ఉండాలన్నారు. కర్ణాటక నుంచి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్, ఎస్పీలు సూచనలు చేశారు.

డ్రగ్స్, మద్యం, డబ్బులు తరలించకుండా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘాను పర్యవేక్షిస్తుండాలన్నారు. అనంతరం తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడి నుంచి తాండూరులోని రిటర్నింగ్ అధికారి(ఆర్వో) కార్యాలయాన్ని కూడా సందర్శించారు. ఆయా కేంద్రాల్లో కావాల్సిన మౌళిక సదుపాయాలు తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు.

ప్రతిజ్ఞ చేసిన కలెక్టర్, ఎస్పీ
మరోవైపు తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో భాతర ప్రథమ హోం శాఖ మంత్రి సర్దార్ వల్ల భాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్రీయ ఏక్ తా దివాస్ లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఎస్పీ కోటిరెడ్డిలు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు, తహసీల్దార్ తారాసింగ్, డీఎస్పీ శేఖర్ గౌడ్. డీఏఓ మహేష్ గౌడ్, సీఐలు రాజేందర్ రెడ్డి, రాంబాబు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత