అదరగొట్టిన సీఎం రేవంత్..!
– ఆకట్టుకున్న తొలి ప్రసంగం
– ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు
– ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ అభివృద్ధి
– అమరులు, నిరుద్యోగుల కోసం కృషి
– రేపు పూలే భవన్‌లో ప్రజా దర్బార్
– ఆరు గ్యారెంటీల తొలి ఫైలుపై సంతకం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి తొలి ప్రసంగాన్ని ఆదరగొట్టారు. సీఎం హోదాలో చేసిన ప్రసంగానికి స్టేడియం దద్దరిల్లిపోయింది. జై తెలంగాణ, జై సోనియమ్మా అంటూ రేవంత్ ప్రసంగాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ సమిధిగా మారి తెలంగాణ ఇచ్చింది.. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామని అన్నారు. గత ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేళ్ల బాధలను ప్రజలు మౌనంగా భరించారని అన్నారు. గత ప్రభుత్వం ప్రగతి భవన్ చుట్టు ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించానని ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తాం.. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చు.. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు అని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇప్పుడిప్పుడే స్వాతంత్య్రం వచ్చిందన్నారు. తెలంగాణ రైతాంగం, నిరుద్యోగుల కోసం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం తెలంగాణా ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీగా మారి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మీకు ఇష్టమైన నాయకుడిగా, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ లాగా మీ మాటను నిలబెట్టుకుంటానని తెలిపారు. నిస్సహాయులకు అండగా ఉంటానని తెలిపారు. మీ సోదరుడిగా.. కొడుకుగా నేను విధులను నిర్వహిస్తానని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడుతూ తెలంగాణను ప్రపంచంతో పోటీపడేలా చేస్తానని అన్నారు. సేవకులం కాదు పాలకులం అని నిరూపిస్తామన్నారు.
నేటి నుంచి నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల కోసం కృషి చేస్తానని తెలిపారు. వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగించుకుంటాను. మీ కృషి గుర్తుండిపోతుందని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు గుండెల్లో నిలుపుకుంటానని సీఎం అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. మీరందరూ రావాలి.

ప్రసంగం అనంతరం ఆరు హామీలకు సంబంధించిన తొలి ఫైలుపై రేవంత్ సంతకం చేసిన తరువాత వికలాంగురాలు రజినీకి ఇచ్చిన హామి మేరకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. రేవంత్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం కాంగ్రెస్ పార్టీలో జోష్‌ను నింపింది.
ఇది కూడా చదవండి…

