ఆరు గ్యారెంటీలకు రూల్స్..!

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఆరు గ్యారెంటీలకు రూల్స్..!
– దరఖాస్తు దారులకు నిబంధనలు
– ప్రక్రియ పూర్తి తరువాత ఏం చేయాలంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరు గ్యారెంటీల దరఖాస్తులకు రూల్స్ ను ప్రకటించింది. ఈ నెల 28 నుంచి ప్రజా పాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పథకంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును అమలు చేసింది. ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి (Mahalaxmi Scheme), రైతుభరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత పథకాలపై దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫొటో ను దరఖాస్తుదారులు జత చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తుపత్రంతో పాటు ఆధార్, ఫోటో ఇవ్వాలి. మిగతా గ్యారంటీల అమలు ప్రక్రియ కోసం దరఖాస్తులను స్వీకరించనుంది.

ఒక్క దరఖాస్తులోనే
ఒక్క దరఖాస్తులోనే ఆరు గ్యారంటీలకు సంబంధించిన కాలమ్‌లు ఉండేలా ప్లాన్ చేసింది. అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఈ దరఖాస్తును రూపొందించారు. మహాలక్ష్మీ పథకంలో ప్రతి నెల రూ. 2500 ఆర్థిక సహాయం అనే కాలమ్ ఉంది. ఈ పథకం కావాలనుకునే వారు.. పక్కన ఉన్న బాక్స్‌లో టిక్ చేస్తే సరిపోతుంది. ఇక అందులోనూ రూ. 500లకు గ్యాస్ సిలిండర్ ఆప్షన్ ఉంది. ఈ పథకం పొందాలనుకునే వాళ్లు ఇక్కడి టిక్ చేయడంతోపాటు గ్యాస్ కనెక్షన్ నంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది.

రైతు భరోసాకు ఏం చేయాలంటే..?
ఇందులో రైతు, కౌలు రైతు, పట్టాదారు పాసు పుస్తకం నంబర్లు, సాగు చేస్తున్న భూమి వివరాలు నమోదు చేయాలి. ఇక ఏటా రూ. 12000 కావాలనుకునే వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. రైతు భరోసా పథకం పొందాలనుకునే వాళ్లు ఇందులో పలు కాలమ్‌లను టిక్ చేయాల్సి ఉంటుంది.

ఇందిరమ్మ ఇళ్ల కోసం
ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం కావాలనుకునే వారు కూడా ఈ దరఖాస్తులోనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో అమరవీరులు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన కాలమ్ కూడా ఉంది. అయితే అమరవీరులు, ఉద్యమకారులకు సంబంధించిన వివరాలు ఇందులో నమోదు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వివరాలు కూడా ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది.

గృహజ్యోతి కోసం
గృహజ్యోతి పథకం కింది నెలకు ఉచిత విద్యుత్ కావాలనుకునే వాళ్లు ఇందులో ఉన్న కాలమ్‌లో వివరాలు నమోదు చేయాలి. వారి గృహ వినియోగ విద్యుత్ మీటర్‌ కనెక్షన్ సంఖ్యను తెలిపాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి

చేయూతను పొందాలంటే..?
చేయూత పథకం కింద నెలకు రూ. 4000 కావాలనుకునే వారు రూ. 6000 పొందాలనుకునే దివ్యాంగులు కూడా చేయూత పథకం కింద ఉండే కాలమ్‌లలో వివరాలు నమోదు చేయాలి. ఇందులో అనేక ఆప్షన్లు ఇచ్చారు. లబ్దిదారులు ఏ కోటాలో చేయూత పథకం పొందాలనే అంశాన్ని తెలియజేయాలి. ఇప్పటికే ఫించన్ తీసుకుంటున్న వాళ్లు దీనికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

ప్రక్రియ పూర్తి తరువాత చేయాల్సింది
లబ్దిదారులు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తరువాత రశీదు పొందడం తప్పనిసరి. దరఖాస్తును తీసుకునే అధికారులు.. ఇందుకు సంబంధించిన రశీదును కూడా అందిస్తారు.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం