ఆర్టీసీలో సమ్మె సైరన్..!
– ఎల్లుండి నుంచి అద్దె బస్సులు బంద్
– యజమానుల డిమాండ్లు ఏమున్నాయంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలోని ఆర్టీసీ సంస్థలో సమ్మె సరైన్ మోగనుంది. ఆర్టీసీ సంస్థకు సేవలందిస్తున్న అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దిగనున్నారు. దీంతో రోడ్లపైకి అద్దె బస్సులు ఎక్కడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మహాలక్ష్మి పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఆర్టీసీ బస్సు (ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు)ల్లో మహిళలకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. దీంతో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇలాంటి తరుణంలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 5న నుంచి సమ్మెబాట పట్టడానికి నిర్ణయించడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారనుండగా.. ప్రయాణికులకు అవస్థలు తప్పేలా లేవు.
డిమాండ్లు ఇవీ..
మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణుకుల సంఖ్య పెరిగింది. నిర్వహణ భారం కూడా పెరిగి పోయింది. ఈ నేపథ్యంలో బస్సుల అద్దెను పెంచాలి.
పరిమితికి మించి లోడ్ ఉన్నపుడు టైర్లు వేడి అయి పేలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త టైర్లు బల్క్ రేట్లకు ఇవ్వాలి.
బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. సీటింగ్ సామర్థ్యానికి మాత్రమే బీమా చెల్లిస్తాం. ప్రమాదాలు జరిగినప్పుడు సీటింగ్ పరిమితికి మించి ఉంటే క్లెయిమ్‌కు ఇబ్బందిగా మారుతుంది. దీనిపై స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వాలి.
బస్సుల్లో ప్రయాణికులు పెరగడంతో కేఎంపీల్పై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రస్తుత కేఎంపీఎల్ (బస్సులను బట్టి కిలో మీటరుకు)తో నడపడం సాధ్యం కాదు. కేఎంపీఎల్‌ను తగ్గించాలి.
ప్రయాణికులకు ఇబ్బందులు
ఆర్టీసీలో అద్దె బస్సులన్నీ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులే కావడం గమనార్హం. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దిగితే బస్సులు లేక ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఇప్పటికే సమ్మె విషయంపై ఆర్ఎంతోపాటు డిపోల వారీగా డీఎంలకు సమ్మె నోటీసు అందజేసినట్లు అద్దె బస్సుల యజమానుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు.
ఇదికూడా చదవండి…

