అమెరికాలో మళ్లీ కాల్పులు.. 11 మంది మృతి..
– తీవ్ర కలకలం రేపుతున్న వరుస కాల్పులు
దర్శిని ప్రతినిధి : అమెరికాలోని మేరిలాండ్ టౌసన్ యూనివర్సిటీ నిన్న కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. అమెరికాలోని వేర్వేరు చోట్ల దుండగులు జరిపిన కాల్పుల్లో 11మంది మృతి చెందగా..పలువురికి గాయాలయ్యాయి. శని, ఆదివారం మొత్తం మూడు చోట్ల కాల్పులు జరిగినట్లు అమెరికా పోలీసు అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, బాలింత ఉన్నారు. వరుసగా జరుగుతున్న తుపాకీ కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపుతున్నాయి. శనివారం రాత్రి అమెరికాలోని వాషింగ్టన్ వాయవ్య ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. లాంగ్‌ఫెలో వీధిలోని 600 బ్లాకులో బ్రైట్‌వుడ్ పార్కు సమీపాన ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగబడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఫ్లోరిడాలోని లేక్ ల్యాండ్‌లో ఓ సైకో తుపాకీతో కాల్పులకు తెగబడటంతో నలుగురు మృతిచెందారు. బుల్లెట్‌ప్రూఫ్ దుస్తులు ధరించి వచ్చిన సైకో లేక్‌ల్యాండ్‌లోని ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో11 ఏళ్ల బాలిక, బాలింత, ఆమె ఒడిలోని శిశువు మృతిచెందారు. పొరుగింట్లో ఉన్న మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. కాగా.. పోలీసులు.. ఆగంతుకుడిపై కాల్పులు జరిపి ప్రాణాలతో పట్టుకున్నారు. అయితే కాల్పులకు కారణం తెలియాల్సి ఉంది. అదేవిధంగా హూస్టన్‌లో ఆదివారం ఉదయం ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతిచెందారు. కాల్పుల అనంతరం ఆ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి నాలుగు మృతదేహాలను గుర్తించారు.