జిప్సం ప్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
– కాలిపోయిన జేసీబీ యంత్రాలు, వస్తువులు
– గుంతబాస్పల్లి గ్రామ శివారులో ఘటన
– ప్రమాదం, ఆస్తినష్టం ఎంతంటే..?
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం గుంతబాస్పల్లి గ్రామ శివారులోని ఇండస్ చెమ్ జిప్సం ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంబవించింది. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గత యేడాది కాలంలో ఈ ప్రమాదం రెండోసారి చోటు చేసుకోవడం గమనార్హం. గ్రామ శివారులో కొనసాగుతున్న ఫ్యాక్టరీలో సిమెంట్ లో కలిపే ముడిసరుకును తయారు చేస్తారు. ఈ క్రమంలో గురువారం రాత్రి పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
గమనించిన కార్మికులు వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. విషయాన్ని తాండూరు అగ్నిమాపక కేంద్రానికి తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని హుటా హుటీనా మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో వెంటనే కోడంగల్, వికారాబాద్ ఫైర్ అధికారులకు సమాచారం అందించి మరో ఫైర్ ఇంజన్లను రప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
ఈ అగ్ని ప్రమాదంలో ఫ్యాక్టరీలో ఉన్న మూడు జేసీబీలు, మోటర్లు, బోవర్స్, ప్యానల్ బోర్డులు, కేబుల్ వస్తువులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. మరోవైపు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఫ్యాక్టరీ ప్రతినిధి దొంత అమరేందర్ కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో విద్యుత్ షాక్ సర్కూట్ వల్ల ప్రమాదం జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అగ్ని ప్రమాదంలో దాదాపు రూ. 2 కోట్ల వరకు ఆస్తినష్టం జరిగినట్లు ఫిర్యాదు చేశారు.
ఇదికూడా చదవండి…

