నిరసన ప్రయోగం
– నీతి అయోగ్‌ను బహిష్కరిస్తాం
– తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన మంత్రాన్ని ప్రయోగిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రం తెస్తున్న నీతి అయోగ్‌ను బహిష్కరిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. శనివారం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించినట్టు చెప్పారు.
నిరర్థక సంస్థగా నీతి ఆయోగ్
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నీతి అయోగ్ నిరర్దక సంస్థగా మారిందని కేసీఆర్ విమర్శించారు. ప్లానింగ్ కమీషన్ ఆఫ్ ఇండియాకు ప్రత్యామ్నాయంగా తీసుకవచ్చిన నీతిఆయోగ్ ద్వారా సహకార సమాఖ్య విధానాన్ని పాటిస్తారని భావించాం. దేశానికి మంచి రోజులు వస్తాయని ఆశించాం. కానీ, దురదృష్టవశాత్తూ నిరర్థక సంస్థగా మారింది. నేతి బీరకాయలో నెయ్యి చందంగా నీతి ఆయోగ్ పరిస్థితి తయారయ్యిందన్నారు. రైతుల ఆధాయం రెట్టింపు చేస్తామని చెప్పిన ప్రధాని రైతులు ఆందోళన చేసే పరిస్థితిని తీసుకవచ్చి… చివరకు నల్ల చట్టాలు రద్దు చేసి ప్రధాని స్వయంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి రావాల్సిన పరిస్థితిని గుర్తుచేశారు. బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో సాగుకు నీరుకు, విద్యుత్‌కు కష్టాలు ఏర్పడ్డాయన్నారు. నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోయిందని, ద్రవ్యోల్బణం, జీడీపీ పతనం, నిత్యావసర ధరల పెరుగులతో విపత్కర పరిస్థితులు దాపురించాయన్నారు. దేశంలో పరిస్థితి చూస్తుంటే నీతి ఆయోగ్‌తో ఓరిగేదేం లేదన్నారు. నీతి ఆయోగ్ రూపకల్పనలో ఎవరికీ ప్రమేయం ఉండదు. ఎవరు ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. పన్నుల వసూలులో రాజ్యాంగపరంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. రాష్ట్రాలకు రావాల్సిన రూ.14లక్షల కోట్ల నిధులను కొల్లగొట్టారు. టీమ్ ఇండియా చేసే పని ఇదేనా? కేంద్ర – రాష్ట్ర ఉమ్మడి పథకాల్లో తెలంగాణ రూ.1.92లక్షల కోట్లు ఖర్చు చేసింది. కేంద్రం నుంచి మాత్రం రాష్ట్రానికి రూ.5వేల కోట్లు వచ్చాయి. కేంద్రానికి మేము పంపించిన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేశారు. జీఎస్టీ బకాయిలు కూడా చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్నాయి’’ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
పద్దతి మారకపోతే ఇబ్బందులే
ఇప్పటికైనా కేంద్రం వైఖరి మారకపోతే మనదేశంలో కూడా శ్రీలంక పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు’’ అని సీఎం వివరించారు. రైతులను కార్లతో తొక్కించారు. రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారు. మేకిన్ ఇండియా అంటే పతంగులు ఎగరేసే మాంజా కూడా చైనా నుంచే వస్తుందా? మేకిన్ ఇండియాతో దిగుమతులు తగ్గాలా? పెరగాలా? ఇండియా భూభాగం 80కోట్ల ఎకరాలు. ఇందులు సాగుకు పనికొచ్చే భూమి 40కోట్ల ఎకరాలు. రూ.3లక్షల కోట్లు బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకుని విదేశాలకు పారిపోతున్నారు. విదేశీ మారక నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. మనదేశంలో కూడా శ్రీలంక పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు’’ అని సీఎం వివరించారు. పాలు, పెరుగు మీద పన్ను.. చివరికి శ్మశానంలో కూడా పన్ను వేస్తున్నారు. గార్భా అనే నృత్యం మీద కూడా పన్ను వేశారు. ఈ నిరంకుశ విధానం దేశానికి మంచిదా? ప్రభుత్వాలను కూల్చడమే సమాఖ్య విధానమా? ఉచిత పథకాలు రద్దు చేయాలని కొత్తగా తెరలేపారు. వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం ఉచితమా? రైతులకు రైతుబంధు, రైతు బీమా ఇవ్వడం ఉచితమా? కొన్ని సంస్థలకు ఎన్‌పీఏల పేరిట రూ.12లక్షల కోట్లు ఇచ్చారు. ఎన్‌పీఏలు రూ.2లక్షల కోట్ల నుంచి 20లక్షల కోట్లకు పెరిగాయి. మహత్తరమైన పాలన అందిస్తే ఎన్‌పీఏలు తగ్గాలి కదా? ఎందుకు 10 రెట్లు పెరిగింది. కొన్ని సంస్థలు, అధికారులు కుమ్మక్కై ఎన్‌పీఏలకు దోచిపెడుతున్నారు. కొందరు రూ.లక్షల కోట్లు బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయారు.



