
ఇసు’కేటుగాళ్లు’..!
– ఉత్తుత్తి ఇంటి నిర్మాణానికి అనుమతులు
– కాగ్నా నుంచి వందల ట్రాక్టర్ల ఇసుక రవాణా
– డీటీ, ఆర్‌ఐల ప్రమేయంటూ ఆరోపణలు
– తాండూరు ఎమ్మెల్యే దృష్టికి వ్యవహారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ఎన్ని చర్యలు చేపట్టినా కేటుగాళ్లు కొత్త పంథాలతో అక్రమాలకు పాల్పడుతున్నారు. రూల్స్‌లను అనుకూలంగా మార్చుకుని దోపిడికి తెరలేపుతున్నారు. తాండూరుకు ప్రధాన నది అయిన కాగ్నా నుంచి ఇసుకను కొల్లగొడుతున్నారు. ఇందులో అధికారుల ప్రమేయంపై ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.

తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయన సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డిలు అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెట్టేందుకు అధికార యంత్రాంగంతో కలిసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకవచ్చారు. అదే రూ. 600లకు ఒక ఇసుక ట్రాక్టర్ వ్యవస్థ. ఎవరైనా ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వానికి ఒక ట్రాక్టర్ చొప్పున రూ. 600లు డీడీ చెల్లిస్తే దానికి అనుమతులు మంజూరు చేస్తారు. నిజానికి ఇంటి నిర్మాణం ఎవరిది, అది ఏ దశలో ఉంది అని తెలుసుకున్న తరువాత అనుమతులు జారీచేయాల్సి ఉంది. ఇక్కడ అలాంటి చర్యలు కనిపించడం లేదు.

అధికారులు కూడా ఇసుక మాఫీయాతో కుమ్మక్కై ఇసుక అనుమతులు జారీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా తాండూరు పట్టణంలోని నెహ్రు గంజ్ ప్రాంతంలో నారాయణ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేస్తున్నారని, ఇందుకు ఇసుక అనుమతులు జారీ చేశారు. అధికారులు ఎలాంటి విషయాలు తెలుసుకోకుండా ఇదే వ్యక్తి పేరుతో వందల ట్రాక్టర్ల ఇసుక అనుమతులు జారీ చేయడం గమనార్హం. ఇందులో తాండూరు రెవెన్యూ శాఖకు చెందిన డీటీ, ఆర్ఐల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డికి దృష్టికి వెళ్లింది. దీనిపై ఎమ్మెల్యే మనోహర్ సీరీయస్‌గా స్పందించి అక్రమ ఇసుక నిల్వలను గుర్తించి సీజ్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

ఇదికూడా చదవండి…

