బంగ్లాపై భగ్గుమన్న తాండూరు..!
– నిరసన ర్యాలీలో కదం తొక్కిన హిందువులు
– హిందూవులపై ఐక్యతపై మార్మోగిన నినాదాలు
– విద్రోహ శక్తుల వ్యతిరేకతకు సంఘటితం కోసం పిలుపు
– తాండూరు డీఎస్పీకి వినతిపత్రం అందజేత
– ఐక్యవేధిక స్వచ్ఛంద బంద్ సంపూర్ణం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బంగ్లా దేశంలో హిందువులపై సాగిస్తున్న దమన కాండాపై వికారాబాద్ జిల్లా తాండూరు భగ్గుమంది. తాండూరు ఐక్యవేధిక పిలుపు మేరకు చేపట్టిన నిరసన యాత్రలో హిందువులు, వ్యాపారులు కదం తొక్కారు. బంగ్లాదేశీలో హిందువుల నరమేధం, దౌర్జన్యదాడులను నిరసిస్తూ తాండూరు ఐక్యవేధిక స్వచ్చంద బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం తాండూరు పట్టణం నెహ్రు గంజ్ ఎల్లమ్మ దేవాలయం నుంచి శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, సంఘాల నాయకులు, వ్యాపారులు, భారీ ఎత్తున పాల్గొన్నారు.
భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. సేవ్ హిందూస్తాన్ ఇన్ బంగ్లాదేశ్ బ్యానర్ ను ప్రదర్శిస్తూ నేతలు, వ్యాపారులు, యువకులు కదం తొక్కారు. పురవీధులు నినాదాలతో మార్మోగింది. పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో మానవ హారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై నరమేధం, దాడులను ముక్తకంఠంతో ఖండించారు. దాడులకు పాల్పడుతున్న విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లోని హిందువులను రక్షించాలన్నారు. అదేవిధంగా బంగ్లా పరిస్థితులు భారతదేశంలో తలెత్తకుండా హిందువులు ఐక్యం కావాలన్నారు.
దేశంలో విద్రోహ వ్యతిరేక విధానాలకు పాల్పడే వారిని తరిమికొట్టాలన్నారు. దాడులకు పాల్పడేందుకు యత్నిస్తే హిందువులందరు సంఘటితం కావాలన్నారు. అనంతరం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యు.రమేష్ కుమార్, రజనీకాంత్, సుదర్శన్ గౌడ్, నాగారం మల్లేశం, మంకాల రాఘవేందర్, బంటారం భద్రేశ్వర్, శేఖాపురం ఆంజనేయులు, పర్యాద రామకృష్ణ, తర్లపల్లి భానుకుమార్, అంతారం కిరణ్, పలువురు వ్యాపారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛంద బంద్ సంపూర్ణం
మరోవైపు ఐక్యవేధిక పిలుపు మేరకు తాండూరులో చేపట్టిన స్వచ్చంద బంద్ సంపూర్ణంగా కొనసాగింది. పట్టణంలోని వస్త్ర దుకాణాలు, హోటళ్లు, వాణిజ్య దుకాణాలు, కిరాణ షాపులు, బంగారు దుకాణాలు, ఇతర దుకాణాలు వ్యాపారులు స్వచ్ఛందంగా మూసి వేసుకున్నారు.

ఉదయం నుంచి దుకాణాలన్నీ తెరుచుకోలేదు. దీంతో ఐక్య వేధిక స్వచ్ఛంద్ సంపూర్ణమయ్యింది. తాండూరు బంద్. తో పలు వ్యాపార ప్రాంతాలు బోసిపోయాయి.
ఇదికూడా చదవండి..

