చిక్కుల్లో పోలీసులు..!
– స్వీపర్ కంప్లైంట్ తెచ్చిన తంటా
– స్టేషన్ బాధితుడి ఘటనలో అనుమానాలు
– సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై విమర్శలు
– ముదురుతున్న బషీరాబాద్ పోలీస్టేషన్ వివాదం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ పోలీసులు చిక్కుల్లో పడ్డారు. అదే పోలీస్టేషన్‌లో పనిచేస్తూ స్వీపర్ ఇచ్చిన ఫిర్యాదు వారికి తంటాలను తెచ్చిపెట్టింది. విచారణ కోసం పిలించిన బాధితుడిపై దాడి చేయడంతో తలకు గాయాలైన సంఘటన జిల్లాలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై పోలీసుల వైపు నుంచి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసలేం జరిగిందో మరోసారి తెలుసుకుందాం. బషీరాబాద్ పోలీస్టేషన్ లో స్వీపర్ గా పనిచేస్తున్న పోతుగంటి అనసూయ, భర్త పోతుగంటి నర్సప్పల వద్ద మండల కేంద్రంలోని ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న కార్మికుడు వడ్డె నగేష్ (33) ఏడాది క్రితం ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి రూ. 30 వేలు తీసుకున్నారు.
ప్రస్తుతం వడ్డీతో కలిపి రూ.80 వేలు అయ్యిందని, డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని స్వీపర్ అనసూయ వడ్డే నగేష్ పై అదే పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మంగళవారం స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మల్లేశం నగేష్ ను పోలీస్టేషన్ కు పిలిపించారు. కాసేపటి తరువాత స్టేషన్ లోనే నగేష్ కుప్పకూలి పడిపోయాడు. ఈ క్రమంలో తలకు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నగేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బాధిత కుటుంభ సభ్యులు తెలిపారు.
సీసీ కెమెరాలపై అనుమానాలు
కాగా బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన జిల్లాలో తీవ్ర వివాదాస్పదంగా మారింది. బాధితుడు స్టేషన్‌కు వచ్చిన రోజు అక్కడ సీసీ కెమెరాలు పనిచేయలేదని పోలీసులు చెబుతున్నారు. అదే రోజు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుటా హుటినా మరమ్మత్తులు చేయించడంలో మర్మమేంటని అనుమానిస్తున్నారు. మరోవైపు బాధితుడు మాత్రం తనను హెడ్ కానిస్టేబుల్ మల్లేశం కొట్టారని స్పష్టంగా పేర్కొంటున్నారు. ఈ సంఘటనై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, న్యాయం కోసం పోరాటం చేస్తామని చెబుతున్నారు. దీంతో ఈ సంఘటన మరింత వివాదానికి, పోలీసులకు చిక్కులను తెచ్చిపెట్టింది.
ఇది కూడా చదవండి…


